బోధన్‌లో గ్యాస్ గోస.. ఏజెన్సీ వద్ద వినియోగదారుల ధర్నా.. అదనపు వసూళ్లపై కౌన్సిలర్ల ఫైర్!
బోధన్: పట్టణంలోని గోశాల రోడ్డులో గల గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బోధన్‌లో గ్యాస్ గోస.. ఏజెన్సీ వద్ద వినియోగదారుల ధర్నా.. అదనపు వసూళ్లపై కౌన్సిలర్ల ఫైర్!
బోధన్: పట్టణంలోని గోశాల రోడ్డులో గల గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న జాప్యం, డోర్ డెలివరీ చేయకపోవడాన్ని నిరసిస్తూ సుమారు వంద మందికి పైగా లబ్ధిదారులు ఏజెన్సీ ఎదుట ఆందోళనకు దిగారు. ఎండలో గంటల తరబడి వేచి ఉన్నా డీలర్ స్పందించకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎండలో 4 గంటల నిరీక్షణ.. కనీస వసతులు లేవు!
ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఏజెన్సీ వద్ద గ్యాస్ స్టాక్ ఉన్నప్పటికీ తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. డోర్ డెలివరీ సక్రమంగా లేకపోవడంతో తాము స్వయంగా ఏజెన్సీ వద్దకు రావాల్సి వచ్చిందని, ఇక్కడ కనీసం తాగునీరు లేదా నీడ కోసం టెంట్ వంటి సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు గంటలకు పైగా ఎండలోనే నిలబడాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.
డీలర్‌ను నిలదీసిన కౌన్సిలర్లు
నిరసన జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముషీర్ బాబా, గుమ్ముల అశోక్ రెడ్డిలు లబ్ధిదారులకు మద్దతుగా నిలిచారు. వెంటనే గ్యాస్ డీలర్‌ను అక్కడికి పిలిపించి నిలదీశారు. లబ్ధిదారులకు వెంటనే ఆన్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని, డోర్ డెలివరీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ వద్దకు వచ్చే వారి కోసం తాగునీరు, టెంట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. డెలివరీ పేరుతో వినియోగదారుల వద్ద నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని డీలర్‌ను హెచ్చరించారు.
శాంతించిన బాధితులు
సమాచారం అందుకున్న పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న లబ్ధిదారులతో మాట్లాడి, డీలర్‌తో చర్చలు జరిపి త్వరగా గ్యాస్ పంపిణీ జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.