Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపాలిటీల్లో 'ట్రయాంగిల్ లవ్ స్టోరీ'

Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ సందర్భంగా చూసిన రాజకీయం కన్నా.. అసలు ట్విస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

Update: 2026-02-18 10:04 GMT

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపాలిటీల్లో 'ట్రయాంగిల్ లవ్ స్టోరీ'

Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ సందర్భంగా చూసిన రాజకీయం కన్నా.. అసలు ట్విస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వారెవ్వా ఇదేం రాజకీయం అన్నట్టుగా పార్టీల ఎత్తులు, వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా మాటల తూటాలు, కత్తులు దూసుకున్న పార్టీల మధ్య ఇప్పుడు పొత్తులు పొడుస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల రాజకీయ ప్రత్యర్థులు. ఏ విషయంలో అయినా వీటి మధ్య రాజకీయ వైరుద్ధ్యం కనిపిస్తుంది. ఆ ఇంటి కోడి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తం అన్నట్టుగా ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. కానీ మున్సిపల్ ఎన్నికల అనంతరం.. కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడటంతో సరికొత్త రాజకీయాలకు బీజం వేస్తున్నాయి. సిద్ధాంతాలను పక్కన పెట్టి.. లోకల్ లీడర్లు ప్రత్యర్థులతో చేతులు కలిపి.. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పీఠాలను పంచుకుంటున్నాయి.

కింగ్‌ మేకర్‌గా ఉన్న పార్టీ.. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న పార్టీకి మద్దతు ఇస్తూ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకుంటున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌‌తో, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌తో బీజేపీ ప్రేమాయణం నేర్పింది. రాజకీయంగా భిన్న ధృవాలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు ఏర్పడటం ఆసక్తిగా మారింది. ఆమనగల్, నర్సాపూర్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్‌కు పాలక వర్గాల ఏర్పాటులో కమలం సహకారం అందించింది. ఛైర్ పర్సన్‌ ఎన్నికకు హస్తానికి మద్దతు ఇచ్చినందుకు గాను వైస్ చైర్మన్ పదవులు తీసుకుంది బీజేపీ. అలాగే సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోనూ.. కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి ఛైర్మన్, వైస్‌ చైర్మన్ పదవిని పంచుకున్నాయి.

ఇక మెట్ పల్లి, బెల్లంపల్లిలో కాంగ్రెస్ కు మద్దతిచ్చింది బీజేపీ. ఐతే మెట్‌పల్లిలో బీజేపీకి అత్యధికంగా 10 స్థానాలు దక్కినా.. ఛైర్మన్ పీఠం చేజారిందని బీజేపీ కౌన్సిలర్లు.. జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. మెట్‌పల్లి ఛైర్మన్ ఎన్నికలో ఓ బీజేపీ కౌన్సిలర్.. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఐతే విప్ జారీ చేయకపోవడం వల్లే.. ఛైర్మన్ పీఠం చేజారిందని బీజేపీ కౌన్సిలర్స్‌ అగ్రహం వ్యక్తం చేశారు.

రాయికల్, ఇస్నాపూర్, జిన్నారం, జమ్మికుంట, ఎల్లంపేటలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చింది కమలం పార్టీ. ఇందులో జిన్నారం, ఎల్లంపేటలో వైస్ చైర్మన్ పదవులతో సరిపెట్టుకుంది. ఇస్నాపూర్ లో బీజేపీ ఒక్క కౌన్సిలర్ గెలవకపోయినా.. ఎక్స్ అఫిషియో సభ‌్యుడిగా బీఆర్ఎస్‌కు ఓటు వేశారు ఎంపీ రఘునందన్ రావు. అలాగే మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మద్దతిచ్చి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈటెల ఓటేశారు. అందుకు గాను వైస్ చైర్మన్ పదవి తీసుకుంది బీజేపీ.

ఇక రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కూడా ప్రేమాయణం కనిపించింది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మేయర్ ఎన్నిక కోసం.. కాంగ్రెస్‌కు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్‌ మద్దతు ఇచ్చింది. ఆమనగల్‌ మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌కు కారు పార్టీ మద్దతు ఇచ్చింది. అందుకు గాను హస్తానికి ఛైర్ పర్సన్ పదవి దక్కగా.. పింక్ పార్టీకి వైన్ ఛైర్మన్ పదవి వరించింది. కామారెడ్డి మున్సిపాలిటలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ మద్దతు ఇవ్వగా.. కారు పార్టీకి వైస్ ఛైర్మన్ పదవి దక్కింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్- బీఆర్ఎస్‌ మధ్య పొత్తు కనిపించింది. ఇలా రాజకీయ ప్రత్యర్థుల మధ్య.. మున్సిపల్ ఎన్నికల సందర‌్భగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. ఐతే మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు ఏర్పడటం అనివార్యం కాబట్టి.. తప్పని పరిస్థితుల్లో పార్టీల మధ‌్య పొత్తులు ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనికి స్తానిక నాయకత్వానికి ఆయా పార్టీలు హైకమాండ్లు నిర్ణయాధికారం ఇవ్వడంతోనే.. ఇలా జరిగినట్టు తెలుస్తోంది.

మున్సిపాలిటీల్లో పార్టీల మధ‌్య స్నేహగీతాలను.. అనైతిక పొత్తులుగా చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ బీ టీం అని బీజేపీ.. లేదు లేదు బీజేపీకే కారు పార్టీ బీ టీమ్ అని కాంగ్రెస్ వాళ్లు విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా.. అన్ని పార్టీల మధ్య పొత్తు కనిపించింది. అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా.. కలిసి పనిచేసేందుకు సై అని పదవులను పంచుకున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, అధికారమే పరమావధి అని మరోసారి రుజువు అయింది. మరి ఇది రాజకీయంగా భవిష్యత్తులో ఎవరికి మేలు చేస్తుందో ఎవరికి నష్టం చేస్తుందో చూడాలి.

Full View


Tags:    

Similar News