Revanth Reddy Temple Politics: రేవంత్ సరికొత్త రాజకీయం...హిందూత్వంపై దృష్టి, ఆలయాల అభివృద్ది
Revanth Reddy Temple Politics :తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. సరికొత్త అంశాలను అధికార కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూత్వాన్ని బలపరుస్తూ... ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆలయాలను అభివృద్ది చేయాలని సంకల్పించారు.
Revanth Reddy Temple Politics: రేవంత్ సరికొత్త రాజకీయం...హిందూత్వంపై దృష్టి, ఆలయాల అభివృద్ది
Revanth Reddy Temple Politics: తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. సరికొత్త అంశాలను అధికార కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూత్వాన్ని బలపరుస్తూ... ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆలయాలను అభివృద్ది చేయాలని సంకల్పించారు.
ఈ విధానాన్ని కేవలం భక్తి పరిమితిలోనే కాకుండా, దీనిని రాజకీయ వ్యూహంగా మలచుకుంటూ ముందుకు సాగుతున్నారు. బాసర, భద్రాద్రి, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సరికొత్త వ్యూహం
ఇటీవల ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి బాసర సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 225 కోట్ల నిధులు కేటాయించారు. తిరుమలలో మాదిరిగా బాసరలో కూడా రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఓ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆలయాలను కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, సాంస్కృతిక వారసత్వంగా కూడా కాపాడాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇదే సమయంలో భద్రాద్రి, వేములవాడ ఆలయాల మాస్టర్ ప్లాన్‌లను స్వయంగా సమీక్షిస్తూ పనుల పురోగతిపై దృష్టి పెట్టడం గమనార్హం.
బీజేపీకి చెక్
తెలంగాణలో బీజేపీ హిందూత్వ నినాదంతో బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ హిందూత్వ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్‌పై ఉన్న మైనారిటీ అనుకూల పార్టీ అనే ముద్రను చెరిపివేయకుండా, మెజారిటీ హిందూ ఓటర్లకు చేరువ కావడం ఈ వ్యూహం లక్ష్యంగా కనిపిస్తోంది. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తి, సంస్కృతిని గౌరవిస్తున్నామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు ఆలయాలను అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాల అమలులోనూ వేగం పెంచుతున్నారు. రైతు, మహిళ, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ద్వంద్వ వ్యూహంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
త్రిముఖపోటీ
బీజేపీ హిందూత్వ అజెండా, కాంగ్రెస్ హిందూత్వ అభివృద్ధి మోడల్, బీఆర్ఎస్ ప్రాంతీయ బలంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే, రేవంత్ రెడ్డి చేపడుతున్న ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తయితేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయని చెప్పొచ్చు. భక్తి, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు అంశాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్న ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో రాబోయే ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.