వరద బాధితులకు సాయం చేసేందుకు సర్కార్ సిద్ధం.. రంగంలోకి 25 ప్రత్యేక బృందాలు

Update: 2020-10-20 03:37 GMT

హైదరాబాద్‌లో వరద ప్రభావానికి గురైన ప్రజలను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ 5 వందల 50 కోట్లు ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నగదు పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఆర్థిక సాయం ఒకే విడుతలో అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభావితమైన ప్రతి ఒక్క కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

బాధితులను తక్షణమే ఆదుకునేల ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వివిధ ప్రాంతాల్లో స్పెషల్‌ ఆఫీసర్‌, జీహెచ్‌ఎంసీ అధికారి, రెవెన్యూ లేదా ఇతర శాఖ అధికారితో కూడిన త్రిసభ్య బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ధేశించింది. నేటి నుంచి మొత్తం 25 బృందాలుగా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సీఎం ఆదేశంచారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటిని లెక్కలోకి తీసుకోవాలని, మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇండ్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ముంపు వల్ల నష్టపోయిన ఇండ్లతో పాటు, గృహాలు, వస్తువులకు జరిగిన నష్టాన్ని లెక్కించి ఎవరూ నష్టపోకుండా చూసుకోవాలని సీఎం ఆదేశంచారు.

మొబైల్‌ యాప్‌ ద్వారా ఆధార్‌ నంబర్‌ సాయంతో ప్రభావిత కుటుంబాల ఇతర వివరాలు నిక్షిప్తం చేస్తారు. వరద నీటిలో చిక్కుకున్న ఒకో కుటుంబానికి పది వేలు, పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు లక్ష రూపాయలు, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఏబై వేలు చొప్పున నష్ట పరిహారాన్ని అందివ్వనున్నారు. ఈ పంపిణీ సమయంలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. దీనివల్ల ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఒక కుటుంబానికి ఒకేసారి సాయం అందించడం సాధ్యమవుతుంది. సాయం పొందిన కుటుంబంలో ఇంటి పెద్దకు ముగ్గురు అధికారులు సంతకాలు చేసిన అక్నాలెడ్జమెంట్‌ పత్రాన్ని అందిస్తారు. 

ఇక జీహెచ్‌ఎంసీ చుట్టూ ఉన్న ఇతర పట్టణ స్థానిక సంస్థల్లో జిల్లా కలెక్టర్‌, స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తారు. రిలీఫ్‌ టీంను లీడ్‌ చేసే స్పెషల్‌ ఆఫీసర్‌ పంపిణీని మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా సాగేలా చూస్తారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు.

Tags:    

Similar News