Street Dogs: హైదరాబాద్‌లో వీధి కుక్కల స్వైరవిహారం.. పిల్లలు, వృద్ధులపై దాడి...

Street Dogs: కుక్కల బెడద నివారించాలంటూ వినతి...

Update: 2022-04-29 03:11 GMT

Street Dogs: హైదరాబాద్‌లో వీధి కుక్కల స్వైరవిహారం.. పిల్లలు, వృద్ధులపై దాడి...

Street Dogs: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వేసవి కాలంలో ఎండలు తీవ్రమవడంతో అధిక ఉష్ణోగ్రతలతో వీధి కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. దీనితో పిల్లలు, వృద్దులపై దాడి చేస్తున్నాయి. నగరంలో కుక్కలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి...కాలనీలలో ప్రజలు ఏమంటున్నారు..అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు .

నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఎంతో మంది గాయాల పాలు అవుతున్నారు. నగరంలో ప్రతీ వీధిలో కుక్కలు పదుల సంఖ్యలో ఉన్నాయి. నగరం మొత్తంగా వెయ్యికి పైగా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీ లలో కుక్కలు మనిషి కనిపిస్తే చాలు అమాంతం మీదపడి దాడులు చేస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలం లో ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కుక్కల బెడద తట్టుకోలేక, బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు జనాలు.

నగరంలోని దాదాపు అన్ని కాలనీల్లోనూ వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. చిన్న పిల్లలు వీధుల్లోకి వెళితే కరుస్తున్నాయి. రాత్రి వేళ వీటి దాడి మరింతగా ఉంటోంది. మహిళలు, వృద్ధులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. తెల్లవారుజామున దినపత్రికలు వేసే బాయ్‌లు, పాల పాకెట్లు వేసే వారిపై దాడి చేస్తున్నాయి. కుక్కల బెడద నివారించాలంటూ నగర పాలక సంస్థకు నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు.సంబంధిత మున్సిపల్ అధికారులు ఈ విషయం దృష్టి సారించి వీధి కుక్కలను అరికట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఈ సారి ఎండాకాలంలో కుక్కలను పట్టుకోవడంలో జి ఎచ్ ఎంసి కొంత నిర్లక్ష్యంగా వహించిందనే చెప్పాలి.ఎండలు ఎక్కువగా ఉండి జనం ఇళ్లకే పరిమితమవడంతో కుక్కలకు ఆహారం దొరకడం కష్టమైపోయింది. రోడ్లపై జనసంచారం తక్కువగా ఉండడంతో పారేసే వేస్ట్ ఫుడ్ కూడా తగ్గిపోయింది. ఆకలికి తట్టుకోలేక మనుషులు కనిపిస్తే చాలు కుక్కలు దాడులు చేస్తున్నాయి. మున్సిపల్‌ అధికారులు వీధి కుక్కలను ఒక వీధిలో పట్టుకొని మరో వీధిలో వదిలివేయడం ఆనవాయితీగా మారింది.

వీటికి శాశ్వత పరిష్కారం లేకపోవడంతో కార్పోరేషన్‌ శాఖకు కుక్కల బెడద తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు జంతు ప్రేమికులు కుక్కలను చంపొద్దని ఉద్యమించడంతో కుక్కలను పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా మున్సి పల్‌ అధికారులు కుక్కలను పట్టుకొని నిర్మానుష్య ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News