Shamshabad: మిస్టరీగా మారిన శంషాబాద్ మర్డర్ కేసు
Shamshabad: జనావాసాల మధ్యే హత్య జరగడంతో భయాందోళనలో శంషాబాద్ వాసులు
Shamshabad: మిస్టరీగా మారిన శంషాబాద్ మర్డర్ కేసు
Shamshabad: శంషాబాద్‌లో మహిళ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. నిందితుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిన్న రాత్రి శ్రీనివాస్ నగర్‌లో ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బైక్ పై మృతదేహాన్ని తెచ్చి స్పాట్ లో దగ్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మహిళ మంటల్లో కాలిపోతుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకునే సరికే మహిళ బాడీ మొత్తం కాలిపోయింది.
రాత్రి 11 గంటల సమయంలో బైక్ మీద ఓ వ్యక్తి వచ్చి పోయినట్లుగా సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు బంక్‌లో పెట్రోల్ తీసుకున్నట్లు ఫుటేజ్ లభించింది. ఆ ఇద్దరు వ్యక్తులు శంషాబాద్ నుంచి ఔటర్ వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు హత్యకు గురైన మహిళ వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. మహిళ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇక మహిళ హత్యతో శంషాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. జనావాసాల మధ్యే ఓ మహిళను అత్యంత పాశవికంగా హత్య చేయడంతో భయపడుతున్నారు. ఇదే ప్రాంతంలో రోజూ ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. మార్నింగ్ వాక్‌కు పోవాలన్నా కష్టంగా మారిందని చెబుతున్నారు.