Whatsapp Online Classes : ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఔదార్యం

Update: 2020-07-15 09:24 GMT

Whatsapp Online Classes : కరోనా వల్ల పిల్లలు ఇప్పటికే స్కూళ్లకు దూరమయ్యారు. నేర్చుకున్న విద్యను కూడా మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు ఎలాగైనా విద్యనందించాలనుకున్నాడు ఓ ఉపాధ్యాయుడు. దానికోసం వాట్సప్ ను మాద్యమంగా ఎంచుకొని ఇంటి నుంచే బోధన చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు..

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న బోయినడ నర్సయ్య రెండు నెలలుగా వాట్సప్ లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. తన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రోజూ హోంవర్క్ ఇచ్చి వారికి పాఠాలు జ్ఞాపకం ఉండేలా చేస్తున్నాడు.

పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉండగా వారి తల్లితండ్రుల వాట్సాప్ నంబర్లను సేకరించారు. వాట్సాప్ నంబర్లతో తరగతుల వారీగా గ్రూపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రోజూ హోం వర్క్స ఇస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ హోం వర్క్ గా ఇస్తున్నారు. మరుసటి రోజున ఆ హోంవర్క్ కాపీలను మళ్లీ వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయిస్తున్నారు. అలా రోజువారీగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి మార్కులు వేస్తున్నారు.

ఆన్ లైన్ లో పాఠాలను చెప్పవద్దని ప్రభుత్వం చెబుతున్నా విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను మరిచిపోకుండా ఉండడానికి సామాజిక మాద్యామాల ద్వారా హోంవర్క్ చేయిస్తున్నానని నర్సయ్య వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించడంతో ఇప్పటి వరకు విద్యార్థులు పాఠాలను జ్ఞాపకం ఉంచుకున్నారని నర్సయ్య వివరించారు. తమ చిన్నారుల చదువుపై ఉపాధ్యాయుడు నర్సయ్య చూపిన శ్రద్ధ ఎంతో బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News