IT Raids: మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
IT Raids: వివేక్ ఇంటితో పాటు కంపెనీలు, అనుచరులు.. బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు
IT Raids: మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
IT Raids: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏ అభ్యర్థి ఇంటికి ఐటీ అధికారులు వస్తారో తెలియడంలేదు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేక్ వెంకట స్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఇటు మంచిర్యాలలో వివేక్ ఇళ్లలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఆయన అనుచరుల నివాసాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.
ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వివేక్ వెంకటస్వామికి చెందిన బ్యాంక్ అకౌంట్లపై ఎన్నికల కమిషన్ అధికారులు నిఘా పెట్టారు. ఆయనకు చెందిన కంపెనీ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా వివేక్... డబ్బు సంచుల కొద్ది తీసుకొచ్చి పంచుతున్నాడని బీఆర్‌ఎస్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆయన ఇంటి దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు. వివేక్‌కు మద్దతుగా నిలిచారు.