ఖమ్మం జిల్లాలో ఓ అభ్యర్థి వినూత్న ప్రచారం.. రూ.100 బాండ్ పేపర్‌తో ఇంటింటికీ క్యాంపెయిన్
Telangana Local Elections: స్థానిక ఎన్నికల సందడి జోరుగా కొనసాగుతోంది. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంత ఇంత కాదు.
Telangana Local Elections: స్థానిక ఎన్నికల సందడి జోరుగా కొనసాగుతోంది. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంత ఇంత కాదు. ఖమ్మం జిల్లాలో ఓ అభ్యర్థి అయితే వినూత్నంగా 100 రూపాయల బాండ్ పేపర్ పై 12 హామీలతో సంతకం చేసి.. గ్రామస్తుల ముందుకు వచ్చాడు. ఆ 100 రూపాయాల బాండ్ పేపర్ లో 12 హామీలను పొందుపరిచాడు. దీంతో ఆ గ్రామంలో ఎక్కడ ఇద్దరు కూర్చున్న ఆ బాండ్ పేపర్‌లోని హామీల గురించే ప్రస్థావన. దీంతో ఆ అభ్యర్థి.. ఆ బాండ్ పేపర్ హామీలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గ్రామ సర్పంచ్ అయ్యేందుకు రాజకీయ నేతలు పడుతున్న కష్టాలు అంత, ఇంత కాదు. ఏకగ్రీవం కోసమైతే ఏకంగా విలువైన భూములు, భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. కానీ, ఓ అభ్యర్థి మాత్రం ఇందుకు భిన్నంగా హామీల పేరుతో ఏకంగా 100 రూపాయాల బాండ్ పేపర్ పై 12 హామీలతో సంతకం చేసి ప్రజల ముందుకు వెళ్తున్నాడు. తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామానికి ఏం ఏం చేయాలనే అంశాలపై చక్కగా ఓ మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాడు సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు.
ఇప్పటికే గ్రామ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన సర్పంచ్ అభర్ధి కొండపల్లి శ్రీనివాసరావు.. వాటి పరిష్కారానికి సంబంధించిన హామీలను 100 రూపాయల బాండ్ పేపర్‌పై ముద్రించి ప్రజలకు అందించడం ద్వారా గ్రామంలో పారదర్శకత, భరోసాకు నిదర్శనంగా నిలిచారు. ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిగా గ్రామంలో గుర్తింపు పొందుతున్నారు. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి.. వాటి పరిష్కారం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆయన.. తన వినూత్న ప్రచారంతో ప్రజల్లో నూతన ఆశలు రేకెత్తిస్తున్నారు. 12 హామీలతో కూడిన బాండ్ పేపర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పేరువంచ గ్రామంలో ప్రతి ఇంటికి ఈ బాండ్ పేపర్ చెరుకోవటంతో సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది.
సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ బాండ్ పేపర్ హామీలకు ప్రజలు ఒకింత ఆశ్యర్యానికి గురవుతున్నా.. తనకే మద్దతు పలుకుతున్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లికి 25 వేల 116 రూపాయల సహాయం, గృహ ప్రవేశాలకు 10 వేల 116 రూపాయలు, ప్రసవాలకు ఆర్థిక అండ వంటి హామీలతో ముఖ్యంగా మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారాయన. అలానే గ్రామంలోని వ్యవసాయ కూలీలకు, ముఠాలకు ప్రమాద భీమా, ఇన్సూరెన్స్ సదుపాయాలు సొంత నిధులతో అందిస్తానని హామీ ఇచ్చారు. వినాయక చవితి, దసరా వేడుకలకు ఉచిత విగ్రహాల పంపిణీ, క్రైస్తవ చర్చీలకు క్రిస్మస్ సహాయం, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా వంటి హామీలతో 100 రూపాయాల బాండ్ పేపర్‌ను ప్రజలకు అందిస్తున్నారు. అంతేకాదు.. ప్రతినెలా గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ చేస్తానని ఆ గ్రామానికి వరాల జల్లు కురిపించారు.
అయితే.. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రజల నుంచి మద్దతు భారీగానే లభిస్తోంది. ఇలాంటి హామీలతో ఇప్పటివరకు ఎవ్వరూ ఎన్నికలకు రాలేదని, కొత్తగా.. వినూత్నంగా బాండ్ పేపర్ పై సంతకం చేసి తమ ముందుకు అభ్యర్థి రావడం ఆనందంగా ఉందని కొంతమంది స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాను ఇచ్చిన 12 హామీల్లో ప్రధానమైనది కోతుల బెడద నుంచి పంట పొలాలను కాపాడటమని, ఎన్నో ఏళ్లుగా రైతులను ఇబ్బంది పెడుతూ.. కోట్ల విలువైన పంటలను నాశనం చేస్తున్న కోతుల సమస్యను ఎంత ఖర్చయినా సరే.. శాశ్వతంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 100 రూపాయల బాండ్ పేపర్ లో ఇదే మొదటి హామీ కావడంతో రైతుల్లో విశేష స్పందన వస్తోంది.