Sarpanch Elections: జనగామ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర పోరు
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఓ కుటుంబంలో పోటీ తీవ్రతరమైంది.
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఓ కుటుంబంలో పోటీ తీవ్రతరమైంది. రఘునాథపల్లి మండలం ఫతేషపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. ఫతేషపూర్ సర్పంచ్ స్థానం బీసీ మహిళా రిజర్వ్‌డ్ కావడంతో.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అన్న భార్య అక్కనపల్లి మాధవి పోటీకి దిగుతుండగా.. తమ్ముడి భార్య అక్కనపల్లి సుజాత కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. దీంతో 8 వార్డులు.. 12వందల 37 మంది ఓటర్లు ఉన్న ఫతేషపూర్ గ్రామంలో తోటికోడళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
తమ అనుచరులతో కలిసి వార్డుల వారీగా.. నువ్వా-నేనా అన్నట్టు ఇద్దరు తోటికోడళ్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను తమ తమ మాటలు, హామీలతో ప్రసన్నం చేసుకునే పనిలో లీనమైపోయారు. చదువుకున్న మహిళగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని.. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తానంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు బీఆర్‌ఎస్ అభ్యర్థి అక్కనపల్లి మాధవి. చదువే అన్ని సమస్యలకు పరిష్కారమన్న మాధవి.. తన ఇద్దరు పిల్లలు ఒకరు డాక్టర్ చదువుతున్నారని, మరొకరు ఇంజనీరింగ్ చేస్తున్నారని చెప్పారు. గ్రామంలోని పిల్లల చదువుకు కూడా తనవంతుగా సాయం చేస్తానని హామీ ఇస్తున్నారు ఫతేషపూర్ గ్రామ బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి అక్కనపల్లి మాధవి.
తాను ఫీల్డ్ అసిస్టెంట్‌గా గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసునని, తన భర్తకు సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉందని అంటున్నారు ఫతేషపూర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అక్కనపల్లి సుజాత. గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి.. అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల మద్దతు కూడా తనకే ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫతేషపూర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అక్కనపల్లి సుజాత.