Hyderabad Weather: పగటి కంటే రాత్రిపూట వేడెక్కుతున్న వాతావరణం... ఆందోళనలో సిటీజనులు

Update: 2025-03-24 14:29 GMT

Hyderabad Weather: పగటి కంటే రాత్రి వేళ వేడెక్కుతున్న వాతావరణం... ఆందోళన కలిగిస్తోన్న పరిణామం

Hyderabad Weather in urban heat island effect: కోర్ హైదరాబాద్ సిటీ... అంటే నగరం నడి మధ్యలో ఉన్న ప్రాంతాల్లో పగటి కంటే రాత్రి వేళ వాతావరణం వేడెక్కుతోంది. పగటి వేళ నగర శివార్ల కంటే నగరం మధ్యలోనే 0.7 డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. కానీ రాత్రి అయ్యేటప్పటికీ సీన్ మారిపోతోంది. సిటీ శివార్లలో ఉండే వాతావరణం కంటే నగరం మధ్య ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళ 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా రాత్రివేళ వాతావరణం వేడెక్కడాన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటారు.

ప్రతీ ఏడాది మార్చి నుండి ఆగస్టు వరకు పగటితో పోల్చుకుంటే రాత్రి వేళ ఈ తరహా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్ 2025 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సిటీ శివార్లలో ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉండటంతో నగర మధ్యలో ఉన్న ప్రాంతాలతో పోల్చుకుంటే శివారు ప్రాంతాల్లో రాత్రివేళ వేడి తగ్గుతోంది.

ఆందోళనకు దారితీస్తోన్న పరిణామం

నగరం మధ్యలో రాత్రివేళ వాతావరణం వేడెక్కుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే, ఇది కేవలం వాతావరణ మార్పులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా ముడిపడి ఉన్న విషయం. పగలంతా ఎండ వేడితో అల్లాడిపోయిన జనానికి కనీసం రాత్రివేళ కూడా ఉపశమనం లేకుండాపోయింది.

పగలు ఎండవేడితో, రాత్రి మరో రకమైన వేడితో నగర జనాభా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇది వారి ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదనేది నిపుణులు వాదన. గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, తీవ్రమైన అలసట వంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది శారీరక సమస్యలే కాదు... మానసిక సమస్యలకు కూడా దారితీస్తుందని అంటున్నారు.

తార్ రోడ్లే కారణమా?

నగరం మధ్యలో రాత్రి వేళ వాతావరణం వేడెక్కడానికి కారణం తార్ రోడ్లు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. పగలంతా సూర్యుడి నుండి ఎండవేడిని గ్రహించుకునే తార్ రోడ్లు రాత్రి వేళ ఆ ఎండ వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. దానికితోడు నగరం మధ్యలో పచ్చదనం తక్కువగా ఉండటం, కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఆ వేడిని తగ్గించేందుకు ఆస్కారం లేకుండా పోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవే కాకుండా శివారు ప్రాంతాలతో పోల్చుకుంటే నగరం మధ్యలో ఎక్కువగా ఏసీల వినియోగం వంటివి కూడా మరో కారణం అవుతున్నాయనే విషయం తెలిసిందే.

Tags:    

Similar News