Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా వానలు

Hyderabad: జలనగరాలుగా మారిన జంటనగరాలు

Update: 2022-07-23 01:07 GMT

Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా వానలు

Hyderabad: చిన్న చినుకు పడినా మహానగరంలో పెద్ద వరదలు పోటెత్తుతాయి. అదే భారీ వాన కురిస్తే జడివాన కురిస్తే పరిస్థితిని ఊహించలేదు. జంటనగరాలు జలనగరాలు కావడానికి గంట సమయం కూడా పట్టదు. నిన్న హైదరాబాద్‌లో అదే సీన్ రిపీట్ అయ్యింది. తెల్లవారుతుండగానే పలకరించిన వాన మధ్యాహ్నాం అవ్వగానే జడివానగా మారిపోయింది. వీధులు చకచక వరదనీటితో నిండిపోయాయి. చూస్తుండగానే రోడ్లపైకి వరదలు వచ్చేశాయి. స్కూళ్లకు వెళ్లిన పిల్లలు, ఆఫీసులకు వెళ్లిన ఉద్యోగులు ఈ వానలో ఎలా వస్తారో అని ఇంట్లోవారంతా టెన్షన్ పడ్డారు.

గతవారంలో కురిసిన వానల ఎఫెక్ట్ అంతా జిల్లాల్లో కనిపించింది. కానీ నిన్న కురిసిన వాన ప్రభావం మహానగరంలో కనిపించింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రహదారులు వాగులను మరిపించాయి. ఓవైపు వాన. మరోవైపు వరదలు ఇంకో వైపు ట్రాఫిక్ జామ్‌ ఇలా వాహనదారులు నడిరోడ్డుపై నరకం చూశారు. రోడ్లపై వరదలు కదులుతున్నాయి. కానీ వాహనాలు ముందుకు కాదలడం లేదు. ఏ రోడ్డు చూసినా ఏ గల్లీకి వెళ్లినా నగరజనాలు ట్రాఫిక్‌జామ్‌తో విసిగెత్తిపోయారు.

ఈ వర్షంలో ఏ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కునే కంటే మెట్రో జర్నీ సేఫ్ అని చాలా మంది మెట్రో బాట పట్టారు. కానీ అక్కడికి వెళ్లాక సర్వర్ ప్రాబ్లమ్‌ వచ్చేసింది. టికెట్లు ఇష్యూ కావడం లేదు. క్షణాల్లో ప్యాసింజర్లు మెట్రో స్టేషన్లలో నిండిపోయారు. బయటకు వెళ్తే వాన,వరదలు. మెట్రో స్టేషన్‌లోనే ఉంటే టికెట్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇలా నగరవాసులు ఓ ప్రత్యేక్ష నరకాన్ని అనుభవించారు.

అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. ఏ సెంటర్ చూసినా ఏ వీధికెళ్లినా ఏ రోడ్డెక్కినా వానలే వానలు. అమీర్‌పేట్ నుంచి బోడుప్పల్ వరకు ఎల్పీనగర్ నుంచి పటాన్‌చెర్వు వరకు అంతటా వర్షం పడింది. బేగంపేట్, సికింద్రాబాద్‌లో అయితే రోడ్లపై మోకాలి లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇక హాఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 9.85 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బాలానగర్ 9.83, గాజుల రామారంలో 9.7 సెంటిమీటర్ల వర్షం పడింది. జీడిమెట్ల, రాజేంద్రనగర్‌లో కూడా 9 సెంటిమీటర్లకు తగ్గకుండా వర్షం దంచికొట్టింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. రాష్టంలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజుల వరకు వర్షాలు ఇలానే కంటిన్యూగా కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఎవరూ కూడా అనవసరంగా బయటకు రాకూడదని హెచ్చరించింది. 

Tags:    

Similar News