Telangana: తెలంగాణలో భారీ వర్షం

Telangana: హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం

Update: 2022-05-04 03:45 GMT

Telangana: తెలంగాణలో భారీ వర్షం

Telangana: రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. భానుడి ధాటికి చెమటలు కక్కుతున్న ప్రజలకు ఉపశమనం కల్గింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా తెల్లవారు జామున కురిసిన భారీవర్షంతో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల రోడ్లు జలమయంగా మారాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ నగరంలో యూసుఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్ షుక్ నగర్, పాతబస్తీ సహా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కాలనీలన్నీ నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

సికింద్రాబాద్ లో 7.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అల్వాల్ 5.9 సెంటిమీటర్లు, ఎల్బీనగర్ లో 5.8 సెంటి మీటర్లు, గోషామహల్, బాలానగర్ లో 5.4 సెంటిమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్లు, బేగంపేటలో 4.9, మల్కాజ్ గిరిలో 4.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గన్ ఫౌండ్రిలో 4.4 సెంటిమీటర్లు, చార్మినార్ లో 4.2, అంబర్ పేటలో 4 సెంటిమీటర్లు, అమీర్ పేట, సంతోష్ నగర్ లో 3.7 సెంటిమీటర్ల, ఖైరతాబాద్ లో 3.6 సెంటిమీటర్లు వర్షపాతం నమోదయ్యింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి కొండపైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిర్లు, టెంట్లు కుప్పకూలాయి. వేకువజామును పడిపోవడంతో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లా జిల్లాల్లో నూ ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాలవర్షంతో వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News