Heavy Rains: భైంసాకు నష్టం మిగిల్చిన వరదలు

Heavy Rains: అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఒక్కసారిగా వరదపోటుతో విలవిల్లాడింది.

Update: 2021-07-23 14:00 GMT

Heavy Rains: భైంసాకు నష్టం మిగిల్చిన వరదలు

Heavy Rains: అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఒక్కసారిగా వరదపోటుతో విలవిల్లాడింది. ఏం జరుగుతుందో తెలుసుకుని తేరుకునే లోపే వరదలు చుట్టుముట్టాయి. కళ్లముందే కాలనీలు నదులు, సముద్రాలను తలపించాయి. ఎక్కడ చూసినా నీరు తప్ప మరో జాడ లేదు. క్రమక్రమంగా పెరుగుతున్న నీటి ఉధృతికి ఆ ప్రాంతంలో ఇళ్లు చెరువులో తేలినట్లు కనిపించాయి. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేడలెక్కారు. కనీసం తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక సాయం కోసం ఎదురుచూపులు చూశారు. ఇదంతా గురువారం వరదల తాకిడికి చిగురుటాకులా వణికిన భైంసా పరిస్థితి.

రెండు మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. దాంతో ఒక్కసారిగా ఆ వరద భైంసాపై విరుచుకుపడింది. ఏకంగా 60 కుటుంబాలు 150 మందికి పైగా జనం బిక్కుబిక్కుమంటూ నరకం అనుభవించారు. చివరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ఒక రోజు మొత్తం భైంసాను ముంచెత్తిన వరదలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. అయితే వరదల నుంచి బయటపడ్డామని అనుకుని ఊపిరి పీల్చుకునే లోపే వరదలు మిగిల్చిన నష్టం వారిని కలచివేస్తుంది. నిన్నమొన్నటి దాకా ప్రశాతంగా ఉన్న ఆటోనగర్‌ ప్రాంతంలో ఒక్కసారిగా రూపురేఖలు మారిపోయాయి. రోడ్డు ఎక్కడ ఉందో ఇళ్లెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. వరదల ధాటికి రోడ్లకు రోడ్లు ఊడ్చుకుపోయాయి. కరెంటు స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. రోడ్డుపై ఉన్న షాపుల జాడే లేకుండా పోయింది. ఇళ్లన్నీ బురదమయం రోడ్లన్నీ గుంతలమయం. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏ వస్తువు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన దుస్థితి. ఇదీ 24 గంటల వరద భైంసా పట్టణానికి మిగిల్చింది. వర్షాకాలం మరో రెండు నెలలు కొనసాగనుండటంతో ఇప్పుడు ఎక్కడ పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు ఆటోనగర్ జనం. అంతా సర్దుకుని ఇంటికి వెళ్దామంటే నిన్నటి వరదల విధ్వంసం వారిని వణికిస్తోంది. ఎప్పుడు మళ్లీ వరద తమ ప్రాణాల మీదకు తెస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. 

Full View


Tags:    

Similar News