Etela Rajender: కాళేశ్వరం నోటీసులపై ఈటల రాజేందర్ ఆగ్రహం
Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చే అవకాశాలపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు.
Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చే అవకాశాలపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే కేసీఆర్ హయాంలో జరిగిన అన్ని నిజాలను బయటపెడతానని ఆయన హెచ్చరించారు.
ఓ ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడుతూ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనతోపాటు పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. అప్పటి పరిస్థితులు వారికి తెలిసి ఉండకపోవచ్చా? అని ప్రశ్నించారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖలో కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఇప్పుడు రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవ్వరూ నెత్తిన కొట్టించుకోలేని రోజుల్లో, తాను ఆరు నెలల పాటు ఉద్యమించిన విషయాన్ని ఈటల గుర్తుచేశారు. కాబట్టి నోటీసులు పంపించటం తనను భయపెట్టదని స్పష్టం చేశారు.
ఇంకా కమిషన్ నుంచి అధికారిక నోటీసులు అందలేదని, అందిన పక్షంలో పార్టీ మార్గదర్శకానుసారం స్పందిస్తానన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై అప్పుడు మంత్రులుగా ఉన్న వారు — తుమ్మల, కడియం, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ప్రాజెక్టు పనుల్లో ఇంజినీర్లు సీఎం ఆదేశాల మేరకే పని చేశారంటే, మంత్రులపై విచారణ ఎందుకు? అని ఈటల ప్రశ్నించారు. ఈ విచారణ ద్వారా సీఎం రేవంత్ రెడ్డే విమర్శల పాలవుతారని హెచ్చరించారు. విచారణ కమిషన్ గడువును పదేపదే ఎందుకు పొడిగిస్తున్నారు? ప్రభుత్వం ప్రజల కోసం దీన్ని ఏర్పాటు చేసిందా, లేక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందా? అని ఈటల తీవ్రంగా ప్రశ్నించారు.