రేపటి నుంచి ఐదు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన
Droupadi Murmu: ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా భారీ భద్రత
రేపటి నుంచి ఐదు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి దాదాపు వారం రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో రాష్ట్రపతి ముర్ము ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతతో పాటు అన్ని శాఖల అధికారులు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ వెంటనే బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి, వీరనారీమణులను సత్కరిస్తారు. రాత్రి 7.45కి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో రాష్ట్రపతి ఈనెల 27న ఉదయం సమావేశమవుతారు. మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతోనూ సమావేశమవుతారు.
భద్రాచలం, రామప్ప ఆలయాలను 28న రాష్ట్రపతి సందర్శించి ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్‌కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. 29న ఉదయం షేక్‌పేటలోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాలను సందర్శించి... విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. సాయంత్రం శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని సందర్శిస్తారు.
శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 30న రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతికశాఖ, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న 'హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతికి విందు ఇస్తారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్టప్రతి ప్రయాణించే మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓలను ఇప్పటికే ఆదేశించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్ అనుసరించి 24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్యబృందాలను నియమించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏవిధమైన లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.