Telangana: నిరుద్యోగులకు శుభవార్త..రూ. 6వేల కోట్లతో స్వయం ఉపాధి పథకం.. రేపే శ్రీకారం

Update: 2025-03-01 02:12 GMT

Telangana: నిరుద్యోగులకు శుభవార్త..రూ. 6వేల కోట్లతో స్వయం ఉపాధి పథకం.. రేపే శ్రీకారం

Employment Schemes in Telangana: ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికులు సిద్ధం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే విధంగా మార్చి 2వ తేదీన వనపర్తిలో రూ. 6వేల కోట్లతో పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తామని తెలిపారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలనికోరారు. హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.

రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐల ఉన్నతీకరణ, నైపుణ్యమున్న మానవ వనరులు, నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా, చక్కటి శాంతి భద్రతలు, మంచి వాతావరణం కల్పించామన్నారు. దావోస్ లో రూ. 1.80లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోకి పెట్టుబడులు మరింత వెల్లువెత్తుతాయని..దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఇతర పథకాలకు రూ. 52,000కోట్లు వెచ్చించామని తెలిపారు.

గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగా వృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఉద్దేశించిన ఇందిరా మహిళా శక్తి స్కీమును విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ మహా నగరంలో మహిళలకు ఆర్థిక చేయూతనిస్తామని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వాలని సూచించారు.

రాష్ట్రంలోని బ్యాంకులు, బ్రాంచీల వారీగా పనితీరు సమీక్షించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రూ. 21,000 కోట్ల రుణమాఫీ చేసినప్పటికీ బ్యాంకర్ల పంట రుణాల లక్ష్యాన్నిచేరలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.తెలంగాణలో ఆహారశుద్ధికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి స్కీమ్ కింద 4,000యూనిట్లలో 729మాత్రమే మంజూరు చేశారన్నారు.

Tags:    

Similar News