Karimnagar: విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి సర్వేలు!
Karimnagar: భారత విద్యా మంత్రిత్వ శాఖ, NCERT మరియు SCERT ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (FLS) పరీక్షలు మార్చి 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నారు.
Karimnagar: విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి సర్వేలు!
కరీంనగర్: భారత విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (NCERT) మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (SCERT) ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (FLS) పరీక్షలు ఈ నెల 30 మరియు 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల నుండి ఎంపిక చేసిన మొత్తం 407 పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశ్యం 3వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు, లెక్కల సామర్థ్యాలను (Foundational Literacy & Numeracy) అంచనా వేయడం. భవిష్యత్ విద్యా ప్రణాళికల రూపకల్పనకు ఈ సర్వే ముఖ్య ఆధారంగా నిలవనుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 20 పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. జిల్లావారీ వివరాలు:
• కరీంనగర్ – 8 పాఠశాలలు
• జగిత్యాల – 6 పాఠశాలలు
• పెద్దపల్లి – 3 పాఠశాలలు
• సిరిసిల్ల – 3 పాఠశాలలు
ప్రతి పాఠశాలలో 3వ తరగతి 12 మంది విద్యార్థులను నమూనాగా ఎంపిక చేసి, రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
• మొదటి రోజు – 6 మంది విద్యార్థులు
• రెండో రోజు – 6 మంది విద్యార్థులు
ఈ పరీక్షలను డిజిటల్ విధానంలో ట్యాబ్‌ల ద్వారా నిర్వహించడంతో పాటు, అవసరమైన చోట రాతపరీక్షకు సంబంధించిన పత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. పరీక్షలో భాషలో 9 అంశాలు, సంఖ్యాజ్ఞానంలో 9 అంశాలు ఉంటాయి.
ఈ కార్యక్రమం నిర్వహణ కోసం డైట్ కరీంనగర్ ఛాత్రోపాధ్యాయులకు ఈ నెల 26 మరియు 28 తేదీలలో ప్రత్యేక శిక్షణ అందించబడింది. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల సహకారంతో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేసి, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఈ సర్వే కీలక పాత్ర పోషించనుంది.