Khammam: ఖమ్మం జిల్లా గ్రానైట్‌ పరిశ్రమలకు కరోనా కష్టాలు

Khammam: సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు * నిలిచిపోయిన గ్రానైట్‌ ఎగుమతులు

Update: 2021-06-01 09:00 GMT

ఖమ్మం గ్రానైట్ ఫ్యాక్టరీ (ఫైల్ ఇమేజ్)

Khammam: ఖమ్మం జిల్లాను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ మహమ్మారి అమాయక పేదలకు పనిలేకుండా చేసింది. కాయకష్టం చేసే కూలీలకు కూడు దూరం చేసింది. ఖమ్మం జిల్లా గ్రానైట్‌ పరిశ్రమలకు పుట్టినిల్లు. ఆ పరిశ్రమలను కూడా వదలలేదు ఆ వైరస్. కరోనా ఎఫెక్ట్‌తో గ్రానైట్‌ పరిశ్రమలు కూడా నష్టాల బరువును మోస్తున్నాయి. మొదటి వేవ్‌ ప్రభావం నుంచి కోలుకోకముందే సెకండ్‌వేవ్‌ వచ్చి దెబ్బ కొట్టింది.

ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రధానంగా మార్బుల్, గ్రానైట్, టైల్స్ సంబంధిత పరిశ్రమలు ఉన్నాయి. మొత్తం 450 గ్రానైట్ పరిశ్రమలతో పాటు వాటికి అనుబంధంగా మరో 1250 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి జీవనం సాగిస్తున్నారు.

అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ఈ పరిశ్రమలు మొదటి వేవ్‌లో షెట్టర్‌ క్లోజ్ చేశాయి. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత పరిశ్రమలను మళ్లీ ప్రారంభించారు. కానీ వలస కూలీలు తిరిగిరాకపోవడంతో గ్రానైట్ పరిశ్రమలను కార్మికుల కొరత వెంటాడుతోంది.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కోలుకోని దెబ్బ కొడుతోంది. క్వారీల నుంచి ముడిసరుకు రావడం లేదు. పైగా గ్రానైట్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీల్లో మెటీరియల్‌ పేరుకపోతోంది. నెలవారీ నిర్వహణ తడిచిమోపడవుతోంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని గ్రానైట్‌ యజమానులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా కష్ట కాలంలో ఎన్నో పరిశ్రమలు నష్టాల అంచున నడుస్తున్నాయి. ప్రభుత్వం వాటిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్‌లో పరిశ్రమలు అంతరించిపోయే ప్రమాదముంది. అలా జరిగితే వాటినే నమ్ముకొని జీవిస్తున్న కూలీల కుటుంబాలు రోడ్డన పడతాయి. 

Full View


Tags:    

Similar News