Revanth Reddy: సీఎం రేవంత్ దిల్లీ టూర్: రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ.. కీలక ప్రాజెక్టుపై చర్చ
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించడంతో పాటు బాపూఘాట్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కేంద్ర మంత్రికి వివరించారు.
మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'గాంధీ సరోవర్' ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం ఆహ్వానించారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను కేవలం స్మారక చిహ్నంగానే కాకుండా.. ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రతిబింబించేలా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ చిహ్నంగా నిలపడమే లక్ష్యమని రాజ్‌నాథ్‌కు వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, రక్షణ శాఖ పరిధిలోని కొన్ని భూముల అంశాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం.