Srisailam Helicopter Tour: హెలీకాఫ్టర్‌లో శ్రీశైలం యాత్ర...తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు హెలీకాఫ్టర్‌ సేవలను ప్రారంభించింది. హెలీకాఫ్టర్‌ ద్వారా కేవలం గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే శ్రీశైలం చేరుకోవచ్చు.

Update: 2026-04-04 05:45 GMT

Srisailam Helicopter Tour: హెలీకాఫ్టర్‌లో శ్రీశైలం యాత్ర...తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ

Srisailam Helicopter Tour : శ్రీశైలం మల్లన్న భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే, ఇది కొంచం ఖరీదైన వార్తే అని చెప్పాలి. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు హెలీకాఫ్టర్‌ సేవలను ప్రారంభించింది. యాత్రను మరింత సులభం, వేగవంతం చేయడం కోసం తెలంగాణ పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రోడ్డు మార్గంలో శ్రీశైలానికి చేరుకోవాలంటే కనీసం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కానీ, హెలీకాఫ్టర్‌ ద్వారా కేవలం గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే శ్రీశైలం చేరుకోవచ్చు.

ఆధ్యాత్మికం ఆహ్లాదం

తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ఈ ప్రత్యేక హెలీ యాత్రలో భక్తులు కృష్ణానది విస్తార దృశ్యాలు, నల్లమల అరణ్య సౌందర్యం, సోమశిల ప్రాంతం వంటి ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించి ఆనందించవచ్చు. ఈ ప్రయాణం కేవలం యాత్రగా మాత్రమే కాకుండా, ఓ ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే ప్రయాణంగా రూపుదిద్దుకుంది. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రత్యేక ప్యాకేజీలు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థ భాగస్వామ్యంతో పర్యాటక శాఖ ఈ సేవలను నిర్వహిస్తున్నది. ప్రారంభ దశలో బెల్‌ 407 హెలీకాఫ్టర్‌ను వినియోగించనున్నారు. కాగా, ఈ శ్రీశైలం యాత్ర సేవలు ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు రకాలైన ప్యాకేజీలను సిద్దం చేసింది పర్యాటక శాఖ. ఇందులో ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజీలు ఉన్నాయి. ఒకరోజు ప్యాకేజీ ధర రూ. 1.10 లక్షలు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి శ్రీశైలం చేరుకొని వీఐపీ దర్శనం పూర్తి చేయించి అదేరోజు సాయంత్రి హైదరాబాద్‌ తీసుకొని వస్తారు. రెండు రోజుల ప్యాకేజీలో వసతి, భోజనంతో పాటు వివిధ ఆలయాల్లో వీఐపీ దర్శన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రెండు రోజుల ప్యాకేజీ ధర రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. ఈ టూరిజం ద్వారా కోల్హాపూర్‌ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ సమయం ఉన్న భక్తులకు, సౌకర్యవంతమైన యాత్రను కోరుకునేవారికి ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి.

Tags:    

Similar News