Hyderabad Traffic : భాగ్యనగరంలో ట్రాఫిక్ విప్లవం.. జూబ్లీహిల్స్ లో ఇక ట్రాఫిక్ జామ్ అనే మాటే వినిపించదు
Hyderabad Traffic : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జి, ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆదివారం ట్రాఫిక్ మళ్లింపులు, వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
Hyderabad Traffic
Hyderabad Traffic : భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్ వైపు వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. నిత్యం ట్రాఫిక్ నరకంతో అల్లాడిపోయే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతాన్ని త్వరలోనే సిగ్నల్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్కు జంక్షన్ల రూపురేఖలు త్వరలోనే మారిపోనున్నాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ప్రతిష్టాత్మకమైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒకసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే, వాహనదారులు ఎలాంటి యూటర్న్‌లు లేదా సిగ్నళ్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఉండే ఆరు ప్రధాన జంక్షన్లను సిగ్నల్ ఫ్రీగా మార్చడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం.
ఆదివారం భారీ మార్పులు.. ట్రయల్ రన్ సిద్ధం
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం (రేపు) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ రెండు గంటల పాటు వాహనాల రాకపోకలను గమనించి, భవిష్యత్తులో శాశ్వతంగా ఇదే రూట్ ని కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్క్.. ఎందుకింత రద్దీ?
ఒకప్పుడు ఊరి చివర కొండలు, గుట్టల మధ్య ఉన్న కేబీఆర్ పార్క్.. ఇప్పుడు హైదరాబాద్‌కు గుండెకాయలా మారింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ హబ్‌లకు వెళ్లాలన్నా.. లేదా బంజారాహిల్స్, ఫిలింనగర్ వంటి విఐపి ఏరియాలకు వెళ్లాలన్నా ఈ పార్కు చుట్టూ తిరగాల్సిందే. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు నిత్యం ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. వ్యాపార పరంగా కూడా ఈ ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందడంతో రోడ్లన్నీ ఎప్పుడూ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అందుకే ఈ రద్దీని తగ్గించడం ప్రభుత్వం అత్యవసరంగా భావిస్తోంది.
భవిష్యత్తులో ప్రయాణం సాఫీగా..
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త ప్లాన్ ప్రకారం.. కేబీఆర్ పార్కు చుట్టూ ఎక్కడా సిగ్నల్ వద్ద ఆగాల్సిన పని ఉండదు. స్టీల్ బ్రిడ్జిల ద్వారా ట్రాఫిక్ ను వేగంగా మళ్లించడం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి వయా చెక్ పోస్ట్ మీదుగా బంజారాహిల్స్ వెళ్లే వారికి ఈ మార్పులు పెద్ద ఊరటనిస్తాయి. ప్రస్తుతం చేపడుతున్న ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే, హైదరాబాద్ ప్రయాణాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టే.