Kamareddy: కామారెడ్డి జిల్లాలో రైతులను హడలెత్తిస్తున్న చిరుత

Kamareddy: కూనలతో పాటు బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో సంచారం

Update: 2021-09-25 09:00 GMT

కామారెడ్డి జిల్లాలో చిరుత టెన్షన్ (ఫైల్ ఇమేజ్)

Kamareddy: చిరుత పులులు రైతన్నలను హడలెత్తిస్తున్నాయి. పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కూనలతో పాటు వనం నుంచి జనంలోకి వచ్చి సంచరిస్తున్న చిరుత పులులు.

కామారెడ్డి జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో సంచరిస్తూ స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శివారు ప్రాంతాలు పంట పొలాల్లోకి వెళ్లాల్సిన వారు చిరుతల భయంతో వణికిపోతున్నారు. మంజీరా పరివాహక ప్రాంతంలో మేతకు వెళ్తున్న ఆవులు, గొర్రెలు, మేకల మందలపై దాడులు చేస్తుండటంతో.. మేకల కాపర్లు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అటవీ ప్రాంతాలకు వెళ్తున్నారు.

10 రోజులుగా చిరుత పులులు సంచరిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో అటవీ, పోలీస్ శాఖల సిబ్బంది పులి సంచరించే ప్రాంతాలను పరిశీలించారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ లో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. మంజీరాకు వరద రావడంతో అక్కడి అటవీ ప్రాంతాల్లో ఉన్న చిరుతలు జిల్లాలోకి ప్రవేశించి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలోను చిరుతల సంతతి పెరగడం ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నట్లు గుర్తించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరుత పులులను త్వరలో బంధిస్తామని అధికారులు చెబుతున్నారు.

చిరుతల భయంతో మూడు మండలాల ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం ఉండకపోవడంతో ఏ వైపు నుంచి చిరుత వచ్చి దాడి చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.

Tags:    

Similar News