అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషయల్‌ రిమాండ్‌ : చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు

Update: 2021-01-14 10:15 GMT

బోయిన్‌పల్లి కేసులో ఏ1గా ఉన్న మాజీమంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. బెయిల్‌ ఇవ్వాలని కోర్టును అఖిలప్రియ తరపు న్యాయవాది కోరారు. బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టు శనివారం విచారణ చేపట్టనుంది. దీంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

అంతకుముందు బేగంపేటలోని పీహెచ్‌సీ సెంటర్‌లో అఖిలప్రియకు కరోనా పరీక్షలు చేయించగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో అక్కడి నుంచి అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా న్యాయమూర్తి నివాసానికి అఖిలప్రియను తీసుకెళ్లిన పోలీసులు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. మూడు రోజుల పాటు అఖిలప్రియను విచారించి కన్ఫెషనల్‌ స్టేట్‌మెంట్‌ను కోర్టుకు సమర్పించారు పోలీసులు.

నిన్నటితో అఖిలప్రియ మూడ్రోజుల కస్టడీ ముగిసింది. ఈ మూడురోజుల పాటు అఖిలప్రియను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. అఖిలప్రియకు దాదాపు 300కి పైగా ప్రశ్నలు సంధించారు పోలీసులు. కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్ డేటా, సిమ్ లొకెషన్, సీసీ ఫుటేజీపై ప్రశ్నలవర్షం కురిపించారు.

మరోవైపు ఈ కిడ్నాప్ వ్యవహారం బాలీవుడ్ మూవీ స్పెషల్ 26ని అనుకరించి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. యూసఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌లో కిడ్నాప్ స్కెచ్ వేయగా వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కూల్‌లోనే మార్చినట్లు అధికారులు గుర్తించారు. స్కూల్ ప్రాంగణం నుంచి సీసీ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు కిడ్నాప్‌ వ్యవహారంలో మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News