Huzurabad: ఉత్కంఠ వీడేది రేపే.. అభ్యర్థుల్లోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ

Huzurabad: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక‌ చివరి ఘట్టానికి చేరుకుంది.

Update: 2021-11-01 12:15 GMT

Huzurabad: ఉత్కంఠ వీడేది రేపే.. అభ్యర్థుల్లోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ

Huzurabad: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక‌ చివరి ఘట్టానికి చేరుకుంది. మరొకొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫలితంతో ఐదారు నెలల ఉత్కంఠకు తెర పడనుంది. హుజురాబాద్‌ బాద్‌షా ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం పైనే అందరి దృష్టి నెలకొంది. మరికొద్ది గంటల్లో విజయం ఎవరిని వరిస్తుందో తేలనుంది. ఇప్పటికే కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా మొదటి అరగంటలో పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎమ్స్‌ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇక ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 22 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్‌లో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్‌కు 14 టేబుల్స్‌పై 14 ఈవీఎంలను లెక్కిస్తారు.

ఇదిలావుంటే, ఈ ఉపఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు ముడి పెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈసారి అనుహ్యంగా పోలింగ్ శాతం పెరగడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెరిగిన ఈ పోలింగ్ పర్సంటేజ్ ఏ పార్టీ కొంప ముంచుతుందోనన్న భయం రాజకీయ పార్టీలను కుదిపేస్తోంది. గతంలో ఏ ఉపఎన్నికలో ఇంతటి భారీ పోలింగ్ నమోదవలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో 90 శాతం పైగా పోలింగ్ నమోదవడం గమనార్హం.

టీఆర్ఎస్‌లో మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు రావడం ఆయనపై టీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ ఉపఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఈ బరిలో నిలిచారు. అయితే వీరిలో కొందరు ఆ తర్వాత వెనక్కి తగ్గారు.

ఇక, హుజూరాబాద్ జనం ఎవరిపక్షం వహించారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీ నేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలు ఈటల గెలుపు తథ్యమంటుంటే మరికొన్ని సర్వేలు టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనంటున్నాయి. మరికొద్ది గంటల్లో జరగునున్న కౌంటింగ్‌లో హుజురాబాద్ బాద్ షా ఎవరో తేలిపోతుంది.

Tags:    

Similar News