India vs Pakistan: పాక్ ఆటగాళ్లతో నో షేక్ హ్యాండ్.. మహిళల ప్రపంచ కప్‌లోనూ హై టెన్షన్
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరును చూసిన అభిమానులకు మరోసారి అలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌ను చూసే అవకాశం వచ్చింది.
India vs Pakistan: పాక్ ఆటగాళ్లతో నో షేక్ హ్యాండ్.. మహిళల ప్రపంచ కప్‌లోనూ హై టెన్షన్
India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరును చూసిన అభిమానులకు మరోసారి అలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌ను చూసే అవకాశం వచ్చింది. ఆసియా కప్‌లో పురుషుల జట్లు తలపడగా, ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఈ రెండు దేశాల జట్లు ఎదురెదురుగా నిలవనున్నాయి. ఈసారి కూడా హై-వోల్టేజ్ పోరును ఆశించవచ్చు. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత మహిళల క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయవద్దని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా పాకిస్తాన్‌ను శత్రు దేశంగా ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం రావడంతో, ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.
భారత, పాకిస్తాన్ మహిళా జట్లు ఈ ఆదివారం తలపడనున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. బీసీసీఐ భారత మహిళా జట్టుకు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1న ఈ సందేశాన్ని టీమిండియాకు పంపినట్లు నివేదించబడింది. "ప్రపంచ కప్ సమయంలో భారత జట్టు పాకిస్తాన్ జట్టుతో షేక్ హ్యాండ్ చేయకూడదు. ఈ విషయంపై సీనియర్ బీసీసీఐ అధికారులు భారత మహిళా జట్టుకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు అని నివేదికలో పేర్కొన్నారు.
భారత్, శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో, భారత్, పాకిస్తాన్ మహిళా జట్ల మధ్య క్రికెట్ పోరు రాబోయే ఆదివారం, అక్టోబర్ 5న జరగనుంది. ఇరు జట్ల మధ్య గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే, గత 20 సంవత్సరాలలో భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు 11 సార్లు వన్డే మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఈ 11 మ్యాచ్‌లలోనూ భారత్ విజయాలను సాధించింది. అంటే, భారత్, పాకిస్తాన్ జట్లు వన్డే మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడటం ఇది 12వ సారి. భారత మహిళా జట్టు ఇప్పటివరకు ప్రదర్శించిన ఆధిపత్యాన్ని బట్టి చూస్తే, ఈ ఆదివారం కూడా పాకిస్తాన్‌పై 12-0 తేడాతో విజయం సాధించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.