IND vs SA 2nd Test: పంత్ కెప్టెన్సీకి తొలి అగ్నిపరీక్ష.. గిల్ లేడు, కోచ్‌పై విమర్శలు..గౌహతిలో టీమిండియా భవితవ్యం ఏమిటి?
IND vs SA 2nd Test:కేవలం 13-14 నెలల క్రితం వరకు సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం ఇతర దేశాలకు కలలోని మాట.
IND vs SA 2nd Test: పంత్ కెప్టెన్సీకి తొలి అగ్నిపరీక్ష.. గిల్ లేడు, కోచ్‌పై విమర్శలు..గౌహతిలో టీమిండియా భవితవ్యం ఏమిటి?
IND vs SA 2nd Test: కేవలం 13-14 నెలల క్రితం వరకు సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం ఇతర దేశాలకు కలలోని మాట. అయితే గత కొంతకాలంగా భారత టెస్ట్ జట్టుకు ఆ స్థాయి భయం తగ్గిపోతోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు అదే దారిలో పయనిస్తోంది. కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో సంచలన విజయం సాధించిన దక్షిణాఫ్రికా, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి గౌహతిలో ప్రారంభం కానున్న రెండవ టెస్ట్ మ్యాచ్ టీమిండియా పరువుకు సంబంధించిన సవాలుగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడినా, డ్రా చేసుకున్నా దక్షిణాఫ్రికా సిరీస్ గెలిచి 25 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుంది.
భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం దక్షిణాఫ్రికాకు దాదాపు అసాధ్యంగా ఉండేది. 2024 అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్ భారత్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత టెస్ట్ చరిత్రలో సొంతగడ్డపై ఎదురైన అత్యంత అవమానకరమైన ఓటమి అది. ఇప్పుడు 13 నెలల తర్వాత దక్షిణాఫ్రికా కూడా అదే ఘనతను పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. గౌహతి పిచ్, అక్కడి పరిస్థితులు ఇరు జట్లకు కొత్త. అంతేకాక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమవ్వడం, కోల్‌కతాలో రెండున్నర రోజుల్లోనే ఓడిపోవడం భారత జట్టును మానసికంగా దెబ్బతీశాయి.
శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో, వికెట్ కీపర్ రిషబ్ పంత్ జట్టు పగ్గాలు చేపట్టాడు. మైదానంలో పంత్‌కు ఇది కొత్త పరిస్థితి. కెప్టెన్‌గా పంత్ తొలి నిర్ణయం ఏంటంటే ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక. గత టెస్ట్‌లో జట్టు కూర్పుపై వచ్చిన విమర్శల కారణంగా, ఈసారి కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అందరి దృష్టిలో ఉన్నారు. టీమ్ ఇండియాలో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. గాయపడిన గిల్ స్థానంలో సాయి సుదర్శన్, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
కేవలం ఆటగాళ్ల ఎంపికే కాదు, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లను ఎక్కడ ఆడిస్తారు, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది కూడా ఈ మ్యాచ్‌లో చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌తో గౌహతిలో మొట్టమొదటిసారిగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన వేదికల్లో గువాహటి 30వ స్థానంలో నిలవనుంది. ఈ మ్యాచ్ డ్రా అయినా లేదా దక్షిణాఫ్రికా గెలిచినా.. ఆ జట్టు 1999-2000 తర్వాత మళ్లీ భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుంది. కాబట్టి టీమిండియాకు ఈ మ్యాచ్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.