Devdutt Padikkal : పడిక్కల్ పరుగుల ఊచకోత..కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 721 రన్స్..కోహ్లీ వరల్డ్ రికార్డుకు ముప్పు
Devdutt Padikkal : బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబైపై పడిక్కల్ విరుచుకుపడ్డాడు.
Devdutt Padikkal : పడిక్కల్ పరుగుల ఊచకోత..కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 721 రన్స్..కోహ్లీ వరల్డ్ రికార్డుకు ముప్పు
Devdutt Padikkal : బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబైపై పడిక్కల్ విరుచుకుపడ్డాడు. 95 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒకవేళ వెలుతురు సరిగ్గా ఉండి మ్యాచ్ ఆగిపోకపోయి ఉంటే, పడిక్కల్ తన ఐదో సెంచరీని కూడా పూర్తి చేసేవాడు. అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్‌తో పడిక్కల్ ఒక అరుదైన ఘనతను సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. గతంలో 2020-21 సీజన్‌లో 737 పరుగులు చేసిన పడిక్కల్, ఇప్పుడు ఈ సీజన్‌లో 721 పరుగులతో మరోసారి సత్తా చాటాడు.
ప్రస్తుతం పడిక్కల్ బ్యాటింగ్ సగటు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 103 సగటుతో దూసుకుపోతున్న పడిక్కల్ ఖాతాలో ఇప్పటికే 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పడిక్కల్ కన్ను ఇప్పుడు మరో రెండు భారీ రికార్డులపై పడింది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల(830) రికార్డును అధిగమించాలంటే పడిక్కల్‌కు మరో 110 పరుగులు కావాలి. సెమీ ఫైనల్లో పడిక్కల్ సెంచరీ బాదితే ఈ రికార్డు బద్దలవ్వడం ఖాయం.
అంతేకాదు, పడిక్కల్ ఇప్పుడు టీమిండియా రారాజు విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక భారీ వరల్డ్ రికార్డు వైపు అడుగులు వేస్తున్నాడు. 2016 ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ 16 ఇన్నింగ్స్‌ల్లో 973 పరుగులు చేసి, ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు పడిక్కల్ ఈ మార్కును అందుకోవాలంటే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో కలిపి 253 పరుగులు చేయాలి. ఇది కష్టమైన పనే అయినా, ప్రస్తుతం పడిక్కల్ ఉన్న భీకర ఫామ్ చూస్తుంటే అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. క్రీజులోకి వస్తే చాలు సెంచరీకి తక్కువ ఏమీ ఆడని ఈ కర్ణాటక ఓపెనర్, కోహ్లీ రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కర్ణాటక జట్టు సెమీస్ చేరడంలో పడిక్కల్ పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను నిర్మించడం, వీలు చిక్కినప్పుడు బౌండరీలతో విరుచుకుపడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం 26 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో పడిక్కల్ సృష్టిస్తున్న ఈ సంచలనం చూస్తుంటే, త్వరలోనే అతడు టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా మారతాడు అనడంలో సందేహం లేదు. పడిక్కల్ ఈ జోరును కొనసాగిస్తే కర్ణాటకకు ఈసారి విజయ్ హజారే ట్రోఫీ దక్కడం తథ్యం.