స్వరం మార్చిన ట్రంప్.. మోడీతో వాణిజ్య చర్చలపై ఆశాభావం!

ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ స్పందించారు. ఇండియాతో చర్చలు సానుకూల ఫలితాలిస్తాయన్న ట్రంప్.. ప్రధాని మోడీతో మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.

Update: 2025-09-10 05:44 GMT

ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ స్పందించారు. ఇండియాతో చర్చలు సానుకూల ఫలితాలిస్తాయన్న ట్రంప్.. ప్రధాని మోడీతో మాట్లాడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే మోడీతో ఫోన్‌లో మాట్లాడతానని అన్నారు. ఈ మేరకు ట్రంప్‌ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. ట్రంప్ పోస్ట్‌కు స్పందిస్తూ ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. వాణిజ్య చర్చలు రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. ఇప్పటికే అమెరికాతో భారత వర్గాలు చర్చలు జరుపుతున్నాయని.. ఈ చర్చలు త్వరలోనే కొలిక్కివస్తాయని తెలిపారు. చర్చల అనంతరం రెండు దేశాల ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుంకాలకు సంబంధించి ఇటీవల భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజు రోజుకూ తన స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో మరికొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాల మధ్య మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై ఒత్తిడి చేసిన ట్రంప్.. అదనపు సుంకాలతో దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ప్రధాని మోడీ తలొగ్గేది లేదన్న సంకేతాలిచ్చారు. భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటుందనే సందేశం ఇచ్చారు. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ చెప్పారు. అయితే ఇన్నాళ్లూ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ స్పందిచకపోగా.. తాజాగా ట్రంపే దిగిరావడంతో టారిఫ్ వార్‌ ముగింపు దశకు చేరుకున్నట్టైంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడంతో రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న టారిఫ్ వార్‌కు ఎండ్‌ కార్డ్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. 

Full View


Tags:    

Similar News