H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై మరిన్ని ఆంక్షలు

H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే మన దేశంలోని ఐటీ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Update: 2025-10-10 12:30 GMT

H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే మన దేశంలోని ఐటీ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో హెచ్‌-1బీ వీసా కార్యక్రమంలో మరిన్ని మార్పులను ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదించింది. ‘రిఫార్మింగ్‌ ద హెచ్‌-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్‌ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ కింద ఈ కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు.. వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టిసారించనున్నారు.

ఈ మార్పులు హెచ్‌-1బీ వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపర్చడానికి, యూఎస్ కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చినవని ఆ ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. అయితే ఈ ప్రతిపాదనల అమలు విషయంలో మాత్రం పూర్తిస్థాయి స్పష్టత లేదు. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే.. లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్‌కేర్ సంస్థలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతాయని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన వల్ల అమెరికా కల కంటోన్న వేలాది మంది భారత విద్యార్థులు, ఆ దేశంలో పని చేయాలని కోరుకుంటున్న యువ నిపుణులపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.

ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 2025లో వెలువడే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. ట్రంప్ తీసుకువచ్చిన లక్ష డాలర్ల ఫీజు గత నెల నుంచే అమలవుతోంది. ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో చట్టం చేస్తే, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమల్లో ఉంటుంది. మన దేశం నుంచి హెచ్‌-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60,000- 1,40,000 డాలర్ల మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో హెచ్‌-1బీ వీసా కోసం ఒక ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకురావడం కష్టమనే ఆందోళనా ఉంది. మరోవైపు, హెచ్‌1బీ కొత్త వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచినా, దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం మరీ అధికంగా ఏమీ ఉండదని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆందోళన వ్యక్తమవుతోన్నప్పటికీ.. వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు మాత్రం ఆగడం లేదు. హెచ్‌-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని మార్చేలా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. అధిక నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే అనుమతించడం, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News