టీడీపీకి మరో సవాల్‌ విసిరిన జగన్‌

Update: 2018-02-19 04:45 GMT

కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చీఫ్‌, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉందని ప్రకటించిన జగన్‌‌ అందుకు టీడీపీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు అందుకు చంద్రబాబును ఒప్పించాలని పవన్‌ కల్యాణ్‌కు సూచించారు.    

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికార టీడీపీపైకి మరో అస్త్రాన్ని సంధించారు. చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జగన్‌‌  ప్రత్యేక హోదా విషయంలో దమ్ముంటే కేంద్రం మీద అవిశ్వాసం పెట్టాలని సవాలు విసిరారు. అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్న జగన్ టీడీపీ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్‌పైనా జగన్‌ సెటైర్లు వేశారు. పవన్ జేఎఫ్‌సీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుందన్నారు. చంద్రబాబు చెప్పే మాటలకు తందాన అనే పవన్ కల్యాణ్ ఏర్పాటుచేసిన జేఎఫ్‌సీ వల్ల... ఏపీకి ఒరిగేదేమీ ఉండదన్నారు. ఎంతిచ్చారు... ఎంత తీసుకున్నారనేది పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడదామంటూ పవన్‌‌కు జగన్ సూచించారు. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పని చేయకుండా డ్రామా ఆర్టిస్టుగా మారారని జగన్‌ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ కొత్త డ్రామా నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందన్న జగన్‌‌ మార్చి 1నుంచి ఏప్రిల్‌ 6వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే చెప్పినట్లుగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

Similar News