సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తెలుగువారి ప్రత్యేక పండుగైన సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్: తెలుగువారి ప్రత్యేక పండుగైన సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. జనవరిలో ఆదివారాలు 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్-అనకాపల్లె(07041), జనవరిలో సోమవారాలు 5, 12, 19 తేదీల్లో అనకాపల్లె- సికింద్రాబాద్ (07042) రైలును నడుపనున్నారు. జనవరిలో శుక్రవారాల్లో 9,16,23 తేదీల్లో హైదరాబాద్-గోరక్‌పూర్(07075) రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, జనవరిలో ఆదివారాల్లో 11, 18, 25 తేదీల్లో గోరక్‌పూర్-హైదరాబాద్ (07076) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21న మచిలీపట్నం- అజ్మీర్ (07274), 28న అజ్మీర్-మచిలీపట్నం(07275) మధ్య ప్రత్యేక రైలును నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
శబరిమలకు నాలుగు ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి సందర్భంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని జనవరిలో దక్షిణమధ్యరైల్వే నాలుగు ప్రత్యేకరైళ్లను నడపనుంది. చర్లపల్లి-కొల్లాం మార్గంలో నడిచే 07135/07136 ప్రత్యేకరైళ్లకు కాచిగూడ, కర్నూలు, డోన్, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్, త్రిచూర్, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. 07135 ప్రత్యేకరైలు జనవరి 14, 21తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07136 ప్రత్యేకరైలు కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పులు
విశాఖపట్నం-లింగంపల్లి మార్గంలో నడుస్తున్న జన్మభూమి (12805/12806) ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో దక్షిణమధ్యరైల్వే మార్పులు చేసింది. ఈ మార్పులు ఫిబ్రవరి 15 నుంచి (ఇరువైపులా)అమల్లోకి వస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ లింగంపల్లిలో ఉదయం 6.55 గంటలకు, బేగంపేటలో 7.20, సికింద్రాబాద్ లో 7.40, చర్లపల్లి నుంచి 8 గంటలకు బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో విశాఖపట్నం నుంచి ప్రతిరోజూ ఉదయం 6.20 గంటలకు బయల్దేరి, చర్లపల్లికి సాయంత్రం 6.05, సికింద్రాబాద్ 6.30, బేగంపేట 6.42, లింగంపల్లికి రాత్రి 7.15 గంటలకు చేరుతుంది. ఈ మార్పులు ఆయా స్టేషన్లలోనూ ఉంటాయని, ప్రయాణికులు మారిన వేళలను గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.