Assembly Elections 2026: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఎలక్షన్స్ ఎప్పుడంటే.
Assembly Elections 2026: అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి పోలింగ్ ప్రారంభం
Assembly Elections 2026
Assembly Elections 2026: భారత ఎన్నికల సంఘం ఆదివారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తేదీలను ఖరారు చేశారు. ఈ ప్రకటనతో సదరు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన ఒకే విడతలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. తమిళనాడు ఓటర్లు ఏప్రిల్ 23న తమ తీర్పును ఇవ్వనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, అక్కడ ఏప్రిల్ 23,ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మే 4వ తేదీన చేపట్టి, అదే రోజు ఫలితాలను విడుదల చేస్తారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, సుమారు 17.4 కోట్ల (174 మిలియన్లు) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి అనేక కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో అనర్హుల పేర్లు లేకుండా 'SIR' విధానాన్ని అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, గోప్యతను కాపాడటానికి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లకూడదని, వాటిని కేంద్రం వెలుపల భద్రపరిచి ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కూడా కఠిన నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.
గతంలో అంటే 2021లో జరిగిన ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించగా, ఈసారి దానిని రెండు దశలకే పరిమితం చేయడం విశేషం. అస్సాంలో కూడా గతంలో మూడు దశల్లో జరగ్గా, ఇప్పుడు ఒకే దశలో ముగియనుంది. మే నెలలో ఈ ఐదు అసెంబ్లీల పదవీకాలం ముగియనుండటంతో, ఈలోగానే కొత్త ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించాయి. పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ఎన్నికల సంఘం కోరింది.