DataTax: మొబైల్ యూజర్లకు షాక్.. ప్రతి GB డేటాపై రూ.1 పన్ను? కేంద్రం కొత్త ప్రతిపాదనలో నిజం ఎంత!
భారతీయ మొబైల్ వినియోగదారులకు షాక్! ప్రతి 1GB డేటాపై రూ.1 పన్ను విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా? టెలికాం శాఖ (DoT) పరిశీలిస్తున్న ఈ కొత్త ప్రతిపాదన వల్ల సామాన్యుడిపై పడే భారం ఎంత? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
DataTax: మొబైల్ యూజర్లకు షాక్.. ప్రతి GB డేటాపై రూ.1 పన్ను? కేంద్రం కొత్త ప్రతిపాదనలో నిజం ఎంత!
DataTax: భారతీయ మొబైల్ వినియోగదారులకు భవిష్యత్తులో ఇంటర్నెట్ వాడకం మరింత భారం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, దానిపై కొత్తగా పన్ను విధించే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన టెలికాం రంగ సమీక్షా సమావేశంలో డేటా వినియోగంపై అదనపు పన్ను అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT)ని ప్రభుత్వం కోరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రధాన ప్రతిపాదనలు ఇవేనంట..
* ప్రతి GBకి రూ.1 పన్ను: వినియోగదారుడు వాడే ప్రతి 1 GB డేటాపై ఒక రూపాయి పన్ను విధించే అవకాశం ఉంది.
* భారీ ఆదాయం: ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే, ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.
వినియోగదారులపై ప్రభావం ఎంతంటే..
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటా లభిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా భారతీయుల డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మనం చెల్లిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లు, పోస్ట్‌పెయిడ్ బిల్లులపై ఇప్పటికే 18% GST విధిస్తున్నారు. కొత్తగా 'డేటా ట్యాక్స్' గనుక వస్తే, అది ఇప్పటికే ఉన్న పన్నులకు అదనపు భారం కానుంది. అంటే నెలకు 30 GB డేటా వాడే వ్యక్తి అదనంగా రూ.30 పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ వార్త సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. టెలికాం శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా, పన్ను విధిస్తే వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పన్ను గనుక అమలైతే, డిజిటల్ ఇండియా వేగంగా దూసుకుపోతున్న తరుణంలో సామాన్యుడిపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలని అంటున్నారు.