Gas Cylinder : గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

Gas Cylinder : పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. వంట గ్యాస్ సరఫరాకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Update: 2026-03-12 02:00 GMT

LPG Supply

Gas Cylinder : పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్‌లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ (LPG) సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పెట్రోలియం శాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, దేశంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం మార్చి 8న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. దేశంలోని రిఫైనరీలు, పెట్రోకెమికల్ సంస్థలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. పారిశ్రామిక అవసరాల కంటే గృహ వినియోగదారులకు (వంట గ్యాస్) సరఫరా చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ పంపిణీని కొంతవరకు క్రమబద్ధీకరించారు. కానీ ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి కోత లేకుండా నిరంతరం వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.

గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. గ్యాస్ ఏజెన్సీలు, నిల్వ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచాలని సూచించింది. ప్రతిరోజూ గ్యాస్ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించాలని డీజీపీలకు ఆదేశాలు అందాయి. అలాగే, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని అస్సలు వదలవద్దని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరతపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. పాత వీడియోలు లేదా సంబంధం లేని ఫోటోలను పెట్టి ప్రజలను భయపెట్టే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని, అవగాహన కల్పించాలని కోరింది. దీనికోసం కేంద్ర హోంశాఖ, సమాచార ప్రసార శాఖ, పెట్రోలియం శాఖల సమన్వయంతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. గ్యాస్ సరఫరాపై ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్రాలు వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా స్పష్టత పొందవచ్చని తెలిపింది.

Tags:    

Similar News