18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్ల అప్పు!

18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-12-13 16:43 GMT

కాకినాడ: 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80 శాతమని చెప్పారు. సంపద సృష్టి అంటే ఇదేనా? అని నిలదీశారు. చంద్రబాబు సంపద సృష్టికర్త కాదని, రుణ సృష్టికర్త అని మండిపడ్డారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు వైయస్.జగన్ పాలనలో అప్పులపై అడ్డగోలు ఆరోపణలు చేశారని, రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేశారని, నేడు చంద్రబాబు పాలనలో సగటున రోజుకూ రూ.500 కోట్లు అప్పు చేస్తుంటే, రాష్ట్రం దివాళా తీయడం లేదా అని నిలదీశారు.

చంద్రబాబు చేసిన అప్పుతో రాష్ట్రం స్వర్గం అవుతుందా? అని ప్రశ్నించారు. ఎక్సైజ్ బాండ్లతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5,490 కోట్లు ప్రభుత్వం అప్పు చేసింని, భవిష్యత్తు ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నాడు వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీబీసీఎల్ ద్వారా అప్పు చేస్తే, గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు, కోర్టు కేసులు, కేంద్రానికి ఫిర్యాదులు చేశారని, నాడు తప్పైంది, మీ హయాంలో ఎలా ఒప్పైందని ప్రశ్నించారు. రోడ్ల మీద గోతులు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం, గ్రోత్ ఇంజన్లు, కారిడార్లు అంటూ అడ్డగోలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వ ప్రచార గాధలను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయని కురసాల కన్నబాబు అన్నారు. 

Tags:    

Similar News