అదే రోజు పరిష్కారం... వాహ్! పవన్ కళ్యాణ్!!
ఓ మహిళా క్రికెటర్ తమ గ్రామం సమస్యని మధ్యాహ్నం చెబితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్రానికి పరిష్కరించారు.
అమరావతి: ఓ మహిళా క్రికెటర్ తమ గ్రామం సమస్యని మధ్యాహ్నం చెబితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్రానికి పరిష్కరించారు. దాంతో రాష్ట్రంలోని ప్రజలు వాహ్! పవన్ కళ్యాణ్!! అంటున్నారు. ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రీ సత్యసాయి మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి గ్రామానికి చెందిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు తెలిపారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని కోరారు. మంగళగిరిలో శుక్రవారం మధ్యాహ్నం అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దీపిక తమ ఊరికి రోడ్డు గురించి అడిగారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రానికి అనుమతులు వచ్చేలా ఉప ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు.
క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను అధికారులు పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.