2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
2027లో గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: 2027లో గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రంలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతంలో గోదావరి నది జన్మస్థానం ఉంది. గోదావరి నది మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రవహిస్తోంది. గోదావరి నదిని దక్షిణ గంగ, గౌతమి అని కూడా పిలుస్తారు.
గోదావరి పుష్కర తేదీలను తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయించారు. పుష్కరాలు మొత్తం 12 రోజులు జరుగుతాయి. 2027, జూన్ 26 నుంచి జూలై 7 వరకు
పుష్కరాలు నిర్వహిస్తున్నట్లు దేవదాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. 2027, జూన్ 26న పుష్కరప్రవేశం జరుగుతుంది. జూలై 7 పుష్కర సమాప్తం అవుతుంది.
పుష్కరాలు అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 పవిత్ర నదులకు వచ్చే హిందూ పండుగ. ఆ సమయంలో ఆ నదులలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గంగ, యమునా, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, తపతి, నర్మద, సరస్వతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత మొత్తం 12 పవిత్ర నదులు.