గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో సంస్కరణలు

పంచాయతీరాజ్ పాలనలో వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టి గ్రామ స్వరాజ్య సాధన దిశగా – స్థానిక సంస్థల పాలకులను, ఉద్యోగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తున్నారు .

Update: 2025-12-13 13:11 GMT

అమరావతి: పంచాయతీరాజ్ పాలనలో వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టి గ్రామ స్వరాజ్య సాధన దిశగా – స్థానిక సంస్థల పాలకులను, ఉద్యోగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తున్నారు . ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖలో – క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పరిపాలన ప్రక్రియలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయమై క్యాంపు కార్యాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం సమాలోచనలు చేశారు. ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగుల ప్యాట్రన్, క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఉన్న హోదాలపై చర్చించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం కావడంతోపాటు, ప్రజలలో సంతృప్త స్థాయి పెంచే విధంగా మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వచ్చ రథం, మ్యాజిక్ డ్రెయిన్ పైలెట్ ప్రాజెక్టులు గురించి ప్రస్తావిస్తూ – ఇలాంటి నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అన్నారు. ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన, భరోసా ఇచ్చే పరిస్థితులు తీసుకురావాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్లతోపాటు స్వచ్ఛమైన జలాన్ని అందించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇందులో భాగంగా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ బలోపేతం కావాలన్నారు. జల్ జీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ చేసేలా సాంకేతికపరంగా శాఖలో మార్పులు అవసరమని చెప్పారు. ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాల అమలు సమర్థంగా సాగాలని, నీటి నాణ్యతా ప్రమాణాల పరీక్షలు సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియలోను సంస్కరణల అవసరంతోపాటు ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టడం తప్పనిసరి అని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

ఉపాధి హామీ పనులు అమలు, వాటి పర్యవేక్షణ ప్రక్రియపై చర్చించారు. ఈ పథకం వల్ల శ్రామికులతోపాటు స్థానిక ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంటుందనీ, గ్రామ సభల్లో తీర్మానాలకు అనుగుణంగా చేపడుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల్లో తీసుకువచ్చే ప్రతి సంస్కరణ అంతిమంగా ప్రజలకు మేలు కలిగించేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖలలో చేపట్టాల్సిన సంస్కరణలు, బెస్ట్ ప్రాక్టీసెస్ పై సత్వరమే నివేదిక ఇవ్వాలని పేషీ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై వారం రోజుల్లో సమీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఓఎస్డీ వెంకట కృష్ణ పాల్గొన్నారు.

Tags:    

Similar News