'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఉత్తరాది భామ రాశీ ఖన్నా. తొలి చిత్రంలో హోమ్లీ లుక్స్‌తో కట్టిపడేసిన రాశి.. ఆ తరువాత గ్లామర్ రోల్స్‌లోనే ఎక్కువగా దర్శనమిచ్చింది. 'జోరు', 'జిల్', 'శివమ్', 'బెంగాల్ టైగర్', 'సుప్రీమ్', 'హైపర్'.. ఇలా రాశి నటించిన ప్రతి చిత్రంలోనూ ఆమె గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'హైపర్' తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తో రాశి కొత్త చిత్రం రాబోతోంది. ఆ సినిమానే 'జైలవకుశ'. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నివేదా మరో హీరోయిన్గా నటించింది. ఇదిలాఉంటే.. వచ్చే నెలలో ఒకే రోజున రాశి నటించిన రెండు సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. గోపీచంద్‌తో రాశి రెండోసారి జోడీకట్టిన 'ఆక్సిజన్' అక్టోబర్ 12న విడుదల కానుండగా.. అదే రోజున విడుదల కానున్న మరో చిత్రం 'రాజా ది గ్రేట్'లో ఓ ప్రత్యేకపాత్రతో పలకరించనుందీ అమ్మడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో 'సుప్రీమ్' హీరో సాయిధరమ్‌తో కలిసి ఓ పాటలో కాసేపు సందడి చేయనుంది రాశి. మొత్తానికి.. ఒకే రోజున రెండు సినిమాలతో రాశి తెలుగు ప్రేక్షకులను పలకరించనుందన్నమాట.