Ramayan: రామయణ సినిమాలో బిగ్ ట్విస్ట్.. శ్రీరాముడితో పాటు పరశురాముడిగా ..!
బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది.
Ramayan: రామయణ సినిమాలో బిగ్ ట్విస్ట్.. శ్రీరాముడితో పాటు పరశురాముడిగా ..!
Ramayan: బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి రణ్‌బీర్ చెప్పిన ఒక విషయం అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది.
ఒకే సినిమాలో రెండు అవతారాలు
ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామ గ్లింప్స్’ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఈ వీడియో విడుదలైన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ఈ సినిమాలో ఆయన కేవలం శ్రీరాముడి పాత్రలో మాత్రమే కాదు, విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన మహర్షి పరశురాముడి పాత్రలో కూడా కనిపించనున్నట్లు తెలిపారు. ఈ రెండు పాత్రలు పౌరాణిక కథల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. ఒకే సినిమాలో ఈ రెండు విభిన్నమైన అవతారాలను పోషించే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రణ్‌బీర్ అన్నారు.
పాత్రల కోసం ఏడాది పాటు ప్రత్యేక సిద్ధం
శ్రీరాముడు ప్రశాంతత, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలుస్తాడు. మరోవైపు పరశురాముడు కోపం, యోధత్వం కలిసిన శక్తివంతమైన అవతారంగా పౌరాణిక గ్రంథాల్లో వివరించారు. ఈ రెండు పాత్రల స్వభావం పూర్తిగా భిన్నంగా ఉండటంతో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి తాను చాలా సమయం కేటాయించానని రణ్‌బీర్ చెప్పారు. షూటింగ్ ప్రారంభానికి ముందు దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ పాత్రల నేపథ్యం, ఆధ్యాత్మిక భావం, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై అధ్యయనం చేశానని వెల్లడించారు. ఈ సన్నాహకంతోనే ప్రేక్షకులకు నిజమైన పౌరాణిక అనుభూతి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ‘రామాయణ’
ఈ మహత్తర ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 4000 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందిస్తోంది. భారతీయ పౌరాణిక గాథను ప్రపంచ స్థాయిలో చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.