Bhanu Priya: భానుప్రియ ఆరోగ్యంగానే ఉన్నారా.? రూమ‌ర్ల‌పై స్పందించిన ఆమె సోద‌రి

Bhanupriya Health Condition: టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రనటిగా వెలుగొందిన భానుప్రియ ఆరోగ్యం గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారం జరుగుతోంది.

Update: 2026-04-05 09:19 GMT

Bhanu Priya: భానుప్రియ ఆరోగ్యంగానే ఉన్నారా.? రూమ‌ర్ల‌పై స్పందించిన ఆమె సోద‌రి 

Bhanupriya Health Condition: టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రనటిగా వెలుగొందిన భానుప్రియ ఆరోగ్యం గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారం జరుగుతోంది. ఆమె మానసికంగా బాగోలేదని, అందుకే సినిమాలకు పూర్తిగా దూరమైపోయిందని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భానుప్రియ సోదరి, నటి శాంతిప్రియ క్లారిటీ ఇచ్చారు.

భానుప్రియ ఆరోగ్యం గురించి వార్త‌లు

అల‌నాటి అందాల తార భానుప్రియ ఆరోగ్యంగా లేర‌ని, ఆమె కొన్ని స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఆమె సోదరి శాంతిప్రియ స్పందించారు. భానుప్రియ కొంతకాలంగా మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నది నిజమే కానీ ఆమె మతిస్థిమితం కోల్పోయిందని చెప్పడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు.

కొన్ని సినిమాల విషయంలో ముందుగా చెప్పిన కథలు తర్వాత మారిపోవడం, పాత్రలు మార్చడం వంటి ఘటనలు ఆమెను నిరాశకు గురి చేశాయని తెలిపారు. షూటింగ్‌కు వెళ్లిన తర్వాత కథలో మార్పులు ఉన్నాయని తెలిసి భానుప్రియ తీవ్రంగా బాధపడిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఆమెపై మానసికంగా ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. దాదాపు 280కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న సీనియర్ నటితో ఇలా వ్యవహరించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల ప్రభావం

భానుప్రియ వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఆమెను ప్రభావితం చేశాయని శాంతిప్రియ తెలిపారు. ముఖ్యంగా భర్త మరణం తర్వాత ఆమె చాలా కాలం పాటు తీవ్రంగా దిగులు చెందినట్లు చెప్పారు.

ఆ తర్వాత ఆమె బయట కార్యక్రమాలకు వెళ్లడం తగ్గించిందని వెల్లడించారు. ఒకప్పుడు కలిసి పనిచేసిన 80ల నటీనటుల సమావేశాలకు కూడా భానుప్రియను పిలవకపోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలు ఆమె మనసును మరింత కలవరపరిచాయని అన్నారు.

ఇక సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై శాంతిప్రియ అసంతృప్తి వ్యక్తం చేశారు. భానుప్రియను నేరుగా సంప్రదించలేకపోతే కనీసం కుటుంబ సభ్యులను సంప్రదించి నిజాలు తెలుసుకోవచ్చని సూచించారు. యూట్యూబ్ వంటి వేదికల్లో ఎలాంటి సమాచారం లేకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదని ఆమె హెచ్చరించారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

కాగా ప్రస్తుతం భానుప్రియ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఆమె కుమార్తె లండన్‌లో చదువుకుంటోందని తెలిపారు. అప్పుడప్పుడు భానుప్రియ కూడా అక్కడికి వెళ్తూ ఉంటుందని వెల్లడించారు. దీంతో భానుప్రియ ఆరోగ్యానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లైంది.

Tags:    

Similar News