'గజిని'తో తెలుగువారికి చేరువైన తమిళ కథానాయకుడు సూర్య. 'శివపుత్రుడు', 'యముడు', 'వీడొక్కడే', 'బ్రదర్స్', '24' తదితర చిత్రాలతో తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఇప్పటికి 40 చిత్రాలు పూర్తిచేసిన సూర్య.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 41వ చిత్రం చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 'తాన సేరంద్ర కూటమ్' అనే పేరుతో తెరకెక్కుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాదం కానుంది. ఇదిలా ఉంటే.. సూర్య తొలి (తమిళ) చిత్రం 'నేరక్కు నేర్' విడుదలై నేటితో (సెప్టెంబర్ 6)కి సరిగ్గా 20 ఏళ్లు అవుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఈ సినిమాలో ఓ హీరోగా నటించాడు. వసంత్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాని నిర్మించగా.. మరో ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. నటుడిగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సూర్య.. మున్ముందు మరిన్ని విలక్షణ పాత్రలతో అలరించాలని ఆకాంక్షిద్దాం.