మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' భారీ తారాగణంతో, టాప్ టెక్నీషియన్లతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. చిరు 150వ చిత్రం 'ఖైదీ నెం.150'లో ఆఫర్ వచ్చినా.. వేరే కారణాలతో చేయలేకపోయిన సునీల్, 'సైరా' రూపంలో మంచి ఆఫర్నే సొంతం చేసుకున్నాడు. గతంలో చిరు నటించిన 'ఇంద్ర', 'ఠాగూర్', 'అందరివాడు', 'స్టాలిన్' వంటి చిత్రాల్లో సునీల్ హాస్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా'ని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.