కర్నూలు జిల్లాలో దారుణం..దంపతులపై ఎస్సై దాడి..!

Update: 2017-12-13 13:15 GMT

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డోన్‌‌ పట్టణంలో ఎస్సై శ్రీనివాసులు రెచ్చిపోయాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన భార్యాభర్తలను చితకబాదాడు. దీంతో.. మనస్తాపం చెందిన బాధితుడు వరదరాజులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. డోన్ పట్టణంలో పల్లీల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వరదారాజు దంపతులు. ఎదురుగా ఉన్న మరో వ్యాపారితో.. కొన్నాళ్లుగా వీరికి తగాదాలు ఉన్నాయి. అది కాస్తా పెద్దదిగా మారి.. ఇవాళ ఘర్షణకు దిగారు. ఈ గొడవలో.. వరదరాజులు గాయాలయ్యాయి. దీంతో.. అతను పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. 

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వరదరాజులును, తనను ఎస్సై శ్రీనివాసులు తీవ్రంగా కొట్టాడని భార్య సుజాత ఆరోపిస్తోంది. పైగా తమపైనే తిరిగి కేసు నమోదు చేస్తానని బెదిరించాడని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా.. ఎస్సై శ్రీనివాసులు జుట్టుపట్టుకొని ఈడ్చిపారేశాడని సుజాత ఆరోపిస్తోంది. ఈ అవమానం భరించలేక.. తన భర్త వరదరాజులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది.  ప్రస్తుతం వరదరాజులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాసిడ్ తాగేయడంతో.. కడుపులో పేగులు కాలిపోయాయని.. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పడంతో.. వరదరాజులు కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. వాళ్లే ఇలా తమ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తోంది వరదరాజులు భార్య సుజాత.తన భర్తకు ఏదైనా జరిగితే.. అందుకు కారణం ఎస్సై శ్రీనివాసులేనని చెప్తోంది. వెంటనే శ్రీనివాసులుపై.. కఠిన చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేస్తోంది.

Similar News