బట్టలూడదీసి కొడితే... బతుక్కు భద్రత వస్తుందా? పవన్‌ ఎందుకా మాటన్నారు?

Update: 2018-05-24 06:18 GMT

ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు జనసేనాని పవన్ కల్యాణ్ అల్టిమేటం ఇచ్చారు. 48 గంటల్లో.. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే.. తాను నిరాహారదీక్షకు దిగుతానని డెడ్‌లైన్ విధించారు. శ్రీకాకుళం జిల్లా పోరాటయాత్రలో భాగంగా టెక్కలి సభలో.. సీఎం చంద్రబాబుపై పవన్ విరుచుకుపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వేదికగా.. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై జనసేనాని నిప్పులు చెరిగారు. తన శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగిసేలోపు.. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. 2 రోజుల్లో.. ఉన్నతస్థాయి కమిటీ వేసి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య గురించి వివరిద్దామంటే.. ఏపీలో వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా లేరన్నారు పవన్. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబుకు.. పవన్ వార్నింగ్ ఇచ్చారు. బెదిరిస్తే.. ఎవరూ బెదిరే వాళ్లు లేరన్నారు. సీఎం గారు పంపించే.. కిరాయిగూండాలను.. జనసేన సైనికులు బట్టలూడదీసి తరిమి తరిమి కొడతారని అన్నారు సేనాని. ఏపీకి హోదా సంజీవని కాదని చంద్రబాబే చెప్పారన్నారు పవన్. ముందే.. జనసేనతో గొంతు కలిపి ఉంటే.. ఇప్పటికే హోదా వచ్చి ఉండేదన్నారు. హోదాకు తూట్లు పొడిచింది ఏపీ సర్కారేనని విమర్శించారు సేనాని. ఇక భావనపాడు పోర్టు విషయంలోనూ ప్రభుత్వం లాలూచీ పడిందన్నారు.

అంతకుముందు పలాసలో కిడ్నీ బాధితులతో పవన్ సమావేశమయ్యారు. ఉద్దానంలో చాలామంది కిడ్నీ బాధితులు ఉండటం బాధాకరమన్నారు. కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందా అని పవన్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు బాధితులకు అండగా ఉంటానన్నారు జనసేనాని.

Similar News