ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంప్లాయిస్‌

Update: 2018-01-02 05:50 GMT

అధికార పార్టీ ఎమ్మెల్యేని... తానేమన్నా చెల్లుతుందనే అహంకారంతో రెచ్చిపోతున్న గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడుకి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా ఉద్యోగులంతా ఏకమయ్యారు. పంచాయతీరాజ్‌ ఈఈని బండబూతులు తిట్టిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటానికి దిగారు. మంత్రి సుజయ్‌కృష్ణకు, కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే ము‌ఖ్యమంత్రి చంద్రబాబుకి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. 

గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడుకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా యంత్రాంగమంతా ఏకమైంది. పంచాయతీరాజ్‌ ఈఈ సత్యనారాయణమూర్తిపై తిట్ట పురాణాన్ని తీవ్రంగా పరిగణించారు. చీటికీమాటికీ అధికారులపై చిందులేస్తూ రెచ్చిపోతున్నా ఇన్నాళ్లూ భరించామని, ఇక సహించేది లేదంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇలానే బెదిరిస్తున్నారని, ఇలాగైతే జన్మభూమి కార్యక్రమంలో పనిచేసే పరిస్థితి ఉండదని ఉద్యోగులు హెచ్చరించారు. రక్షణ కల్పించాలంటూ కలెక్టర్‌ వివేక్‌కు ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. దాంతో సమస్యను అప్రోప్రియేట్‌ ఫోరానికి పంపిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుని కలిసిన ఉద్యోగులు ఎమ్మెల్యే కేఏ నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు వ్యవహార శైలితో మహిళా ఉద్యోగులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీస గౌరవం ఇవ్వకుండా ఏకవచనంతో పిలుస్తున్నారని వాపోతున్నారు. అయితే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఒక్కటవడంతో సమస్య ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.

Similar News