మేడారంలో మంటలు

Update: 2017-12-21 07:12 GMT

లంబాడీ, ఆదివాసీల మధ్య జరుగుతున్న పోరు సెగ ఇప్పటికే మేడారం జాతరకు తగిలింది. దీంతో ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మల జాతర సజావుగా సాగడంపై అనుమానాల మబ్బుతెరలు కమ్ముకున్నాయి. రెండేళ్లకోసారి జరిగే మినీ కుంభమేళా మేడారం జాతర నిర్వహణ ఇప్పుడు అందరికీ సవాల్ గా మారింది. 

రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను మినీ కుంభమేళాగా చెబుతారు. 1996 నుంచి మేడారం జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. వనదేవతలను ఆరాధించేందుకు గిరిజనులు, అదివాసీలు పెద్ద సంఖ్యలో  సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వస్తుంటారు. వాళ్లే కాదు వివిధ కులాలకు చెందిన వారు సైతం పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు. కోటి మందికిపైగా భక్తులు వచ్చే ఈ మహా జాతర నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

అయితే ఇటీవల లంబాడీలు, ఆదివాసీల మధ్య జరుగుతున్న పోరు మేడారం జాతరపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వర్గాల నుంచి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో  జాతరను సజావుగా జరపడం ప్రభుత్వానికి పెనుసవాల్ కానుంది. ఇప్పటికే మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో నిరసనలు చెలరేగాయి. బోర్డు ప్రమాణ స్వీకార సమయంలో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. వనదేవతల జాతరకు తమను కాదని ట్రస్ట్ బోర్డులో ఇతరుల నియామకాన్ని ప్రశ్నిస్తూ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు ఆదివాసీలు.

మహా జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సాగాలంటే భారీ బందోబస్తు అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయడం అధికార గణానికి కత్తిమీద సామే కానుంది. రెండు వర్గాల మధ్య గొడవలు జాతరపై ప్రభావం చూపకుండా ఇటు ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Similar News