పిక్నిక్‌కు వెళ్లిన 12 మంది గల్లంతు... మరో 30 మంది....

Update: 2018-08-16 05:51 GMT

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో పిక్నిక్ కోసం వచ్చిన 12 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. ఊహించని విధంగా ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. శివపురి, గ్వాలియర్ సరిహద్దుల్లోని సుల్తాన్‌ఘడ్ పోల్ దగ్గర పిక్నిక్ చేసుకుందామని వచ్చిన 12 మందిపైకి వరదనీరు ముంచెత్తడంతో వారంతా వంద అడుగుల దిగువకు పడిపోయారు. వరదనీరు వారిని కిందకు నెట్టేసింది. మరో 30 మంది నది మధ్యలో రాతిపైభాగాన చిక్కుకుపోయారు.

వరద నీటిలో చిక్కుకున్న వారిలో 8 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో బయటకు తీసుకురాగలిగింది. ప్రస్తుతం అక్కడ బాధితులను రక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో జనం ఇక్కడికి పిక్నిక్ చేసుకునేందుకు వచ్చారు. ఉన్నట్టుండి నదిలోని నీటిమట్టం పెరిగింది. దీంతో భయాందోళనలకులోనైన వారికి ఏం చేయాలో తెలియలేదు. ఇంతలోనే వారిలో 12 మంది వరదలో కొట్టుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Similar News