టీఎంసీపై విరుచుకుపడిన మోదీ

పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.

Update: 2025-12-20 12:08 GMT

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. వాతావరణ ప్రతికూలత వల్ల శనివారం మోదీ హెలికాప్టర్ తహెర్‌పూర్‌లో దిగలేకపోయింది. దీంతో ఆయన కోల్‌కతా విమానాశ్రయానికి తిరిగి వెళ్లిపోయారు. తహెర్‌పూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ఫోనులో మాట్లాడారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని మండిపడ్డారు. టీఎంసీ 'మహా జంగిల్ రాజ్'కు బీజేపీ చరమగీతం పాడుతుందన్నారు. వాళ్లు పశ్చిమబెంగాల్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వమని పశ్చిమబెంగాల్ ప్రజలకు ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నానని మోదీ చెప్పారు. మీరు మోదీని వ్యతిరేకించండి, కానీ ప్రజల సంతోషాన్ని అడ్డుకోకండి. ప్రజల హక్కులను కాలరాయకండి. వారి కలలను చెల్లాచెదురు చేసే పాపానికి ఒడికట్టకండి అని ప్రధాని హితవు పలికారు. చొరబాటుదారులను కాపాడుకునేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, బెంగాల్‌లో చొరబాటుదారులకు టీఎంసీ ప్రాపకం లభిస్తోందని ఆరోపించారు.

అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా రణఘాట్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.3,200 కోట్లతో నిర్మించనున్న రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కోల్‌కతాను సిలిగురితో అనుసంధానిస్తూ సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా చేస్తాయని పీఎంఓ తెలిపింది. ఈ ప్రాజెక్టులతో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం కావడంతో పాటు పర్యాటకం కూడా పెరుగుతుందని తెలిపింది.

Tags:    

Similar News